- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బీసీ రిజర్వేషన్’పై నేడు విచారణ.. హైకోర్టు తీర్పుపై సస్పెన్స్!
రాష్ట్రంలో కొంత కాలంగా సాగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠకు నేడు తెరపడనుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొంత కాలంగా సాగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠకు నేడు తెరపడనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత తీర్పు వెలువడే అవకాశముంది. దీంతో రాజకీయ పార్టీల నాయకులు, కింది స్థాయి నేతలు, అధికారులు, బీసీ సంఘాలు న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురుచూస్తున్నాయి. హైకోర్టు తీర్పు ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతాయా? లేదా? ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా? లేదంటే వాయిదా పడతాయా? వంటి అంశాలన్నింటికీ సమాధానం దొరకనుంది
ఇంప్లీడ్ పిటిషన్లు
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో నెం 9 జారీ చేసింది. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్‌శాఖ సైతం 41, 42 జీవోను జారీ చేసింది. ఈ జీవోలు సుప్రీంకోర్టు తీర్పునకు (రిజర్వేషన్లు 50% దాటొద్దు) విరుద్ధమని, ఆ జీవోలను కొట్టేయాలని రెడ్డి జాగృతి నేత బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గత నెల27న హౌస్మోషన్పిటిషన్దాఖలు చేశారు. దానిపై విచారించిన కోర్టు.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు ఉదయం హైకోర్టులో కోర్టు 1లో 42 అంశంగా ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్ ధర్మాసనం ఎదుటకు రానున్నది. ఈ పిటిషన్‌పై దాదాపుగా 25 మంది రాష్ట్ర బీసీ నాయకులు ఇంప్లీడ్పిటిషన్దాఖలు చేశారు. వీరిలో ప్రధానంగా ఎంపీ ఆర్కృష్ణయ్య, ఎమ్మెల్సీ మల్లన్న, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జూజుల శ్రీనివాస్, మెట్టు సాయి కుమార్, చరణ్కౌశిక్యాదవ్, రిటైర్డ్ ఐఏఎస్చిరంజీవులు సహా అనేక మంది పిటిషన్లుదాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా వీరందరూ తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని, రాజకీయంగా గుర్తింపు రావడానికి ఇదొక అవకాశమని వారు కోర్టుకు వివరించనున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల కోసం ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ దశల్లో ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ అంశాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై అడుగడుగునా జాగ్రత్తలు తీసుకుంటున్నది. హైకోర్టులో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. సోమవారం సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ఒక రోజు ముందే ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బృందం న్యాయనిపుణులు, ఉన్నతాధికారులతో చర్చించింది. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే హాజరయ్యారు. నేడు హైకోర్టులోనూ విచారణ ఉండటంతో స్వయంగా హాజరు కావాలని సింఘ్వీకి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఫోన్ చేసి రిక్వెస్టు చేశారు. దీంతో ఆయన నేడు హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
సీఎంతో మంత్రులు భేటీ
హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన చర్యలు తదితర అనుబంధ అంశాలపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. బీసీలకు కాంగ్రెస్‌ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, కులగణనతో సేకరించిన ఎంపిరికల్ డేటా ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశామని హైకోర్టులో వాదనలు వినిపించాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా త్రిపుల్టెస్ట్, డెడికేటెడ్కమిషన్ను నియమించామని కోర్టుకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం అవసరమైన అన్ని రకాల ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేసిందని, జనాభాకు అనుగుణంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి గతంలో బిల్లులు తీసుకువచ్చామని, ఆరు నెలలుగా అవి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వాదించనున్నారు. సామాజికంగా బీసీలు వెనకబడి ఉన్నారని, వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించడానికి, వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు కోర్టుకు తెలియజేయాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం
రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు మంత్రి వాకిటి శ్రీహరి అధికారిక నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. దీనికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, ఎంపీలు సురేశ్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, రాజ్ ఠాకూర్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర బీసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని, హైకోర్టు వినిపించనున్న వాదనలపై చర్చించారు. బీసీల రిజర్వేషన్లు బీజేపీకి ఇష్టంలేదని, అందుకే రాష్ట్రపతి వద్ద ఆరు నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేయాలని నిర్ణయించారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మాణానికి సహకరించిన పార్టీలు ఇప్పుడు మాత్రం వ్యతిరేకిస్తున్నాయనే వాదనలు సైతం వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పొరాటం చేయాలని డెసిషన్ తీసుకున్నారు.






