- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు.. అధికారులతో మంత్రి సమీక్ష
ఇప్పుడు జీవనశైలి సమస్య ఎక్కువైందని.. ఇందుకు అనుగుణంగా వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఒక్కప్పుడు అంటువ్యాధుల సమస్య ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు జీవనశైలి సమస్య ఎక్కువైందని.. ఇందుకు అనుగుణంగా వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodara Rajanarsimha) అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో శనివారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. 2009లో డయాలసిస్ సేవలు ప్రారంభించినప్పుడు 1230 మంది డయాలసిస్ పేషెంట్లు, ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 12 వేలు దాటిందని తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. కిడ్నీ, క్యాన్సర్ జబ్బులు పెరగడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డయాలసిస్ పేషెంట్లు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారని, వారికి పెన్షన్ అందించి కొంత వరకూ ఆర్థికంగా బాసటగా నిలుస్తున్నామన్నారు. కిడ్నీ రోగులు భారీగా పెరిగినందున ప్రతి 20 కి.మీ దూరానికో డయాలసిస్ సెంటర్ ఉండేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇక నగరంలో దూరంతో సంబంధం లేకుండా ప్రయాణ సమయాన్ని బట్టి అర గంటలోపు చేరుకునేలా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. డయాలసిస్ కోసం పదుల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి, గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండకూడదన్నారు. పేషెంట్లతో పాటు ప్రయాణించి, పేషెంట్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండొద్దన్నారు. పట్టణ ప్రాంతాల్లో డిస్టెన్స్‌తో పాటు, పేషెంట్ల సంఖ్య, జనాభాను కూడా పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే ఉన్న సెంటర్లలో అవసరమైనచోట మిషన్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వీటితో కలిపి ప్రస్తుతం102 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో సుమారు 7550 మంది పేషెంట్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటళ్లలో సుమారు మరో 5060 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని అధికారులు మంత్రికి తెలిపారు.
జీవన శైలి వ్యాధులపై దృష్టి పెట్టండి...
దేశంలో, రాష్ట్రంలో ఒకప్పుడు అంటువ్యాధుల సమస్య ఉండేదని, ఆ వ్యాధుల నియంత్రణకు అనుగుణంగానే మన వైద్య రంగం తయారు చేయబడిందన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, అంటువ్యాధులు తగ్గిపోయి జీవనశైలి రోగాలు (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) పెరిగిపోయాయన్నారు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన సెడెంటరీ లైఫ్ స్టైల్ వంటి అనేక కారణాల వల్ల కుగ్రామంలో కూడా బీపీ, షుగర్, కిడ్నీ, గుండె జబ్బులు, కేన్సర్లు పెరుగుతున్నాయన్నారు. ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా వైద్య వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై స్టడీ చేయాలని, ఇతర దేశాల్లో అవలంబిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌ల నివారణ, నియంత్రణ, చికిత్స అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలన్నారు.
నాన్ కమ్యునికెబుల్ డిసీజ్‌లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ఆరోగ్యకరమైన జీవన విధానంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. బీపీ, షుగర్లు వస్తే పోయేవి కాదు అని, కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ చికిత్స ఒక్కరోజుతోనే ఒక నెలతో పూర్తవ్వదని రోగులకు తెలిసేలా చెప్పాలన్నారు. ఆయా జబ్బుల బారిన పడిన ప్రజలకు చికిత్స అందించేందుకు అనుగుణంగా మన హాస్పిటల్స్ తయారు కావాలన్నారు. అందులో భాగంగానే ఎన్‌సీడీ క్లినిక్‌లు, కేన్సర్ డే కేర్ సెంటర్లు పెట్టుకున్నామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తు, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






