- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలి తీవ్రత.. ఫ్లూ పట్ల ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ
రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ బుధవారం పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం సాధారణ ఆరోగ్య అడ్వైజరీని విడుదల చేసింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగడంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా సీజనల్ ఫ్లూ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. సీజనల్ ఫ్లూ అనేది జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శరీర నొప్పులు, అలసట వంటి లక్షణాలతో కనిపించే సంక్రమణ వ్యాధి అని, దగ్గు లేదా తుమ్ము ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుందని అడ్వైజరీలో పేర్కొన్నారు. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు ఇంటివద్దే విశ్రాంతి తీసుకుని, ఎక్కువగా ద్రవాలు తీసుకుంటే సాధారణంగా వారం రోజుల్లో కోలుకుంటారని సూచించారు.
గర్భిణీలు, ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఫ్లూ బారిన పడితే తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని తెలిపారు. వీరికి జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పెదవులు లేదా చర్మం నీలం రంగులో మారడం, కఫంలో రక్తం రావడం, ప్రవర్తనలో మార్పులు వంటి హెచ్చరిక లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను సంప్రదించాలని తెలిపారు.
ఫ్లూ నివారణకు భాగంగా నోరు, ముక్కు కప్పుకుని దగ్గు లేదా తుమ్ము చేయడం, తరచూ చేతులు సబ్బుతో కడుక్కోవడం, జబ్బు ఉన్నప్పుడు గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం, పోషకాహారం తీసుకోవడం, సరైన నిద్ర అవసరమని సూచించారు. చేతులు కలపడం, గుంపులుగా ఉన్న చోట్లకు వెళ్లడం, వైద్యుల సలహా లేకుండా మందులు వాడడం వంటి వాటిని నివారించాలని స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక బెడ్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచినట్లు డీహెచ్ డా. బి రవీంద్రనాయక్ తెలిపారు.






