- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తిగత సిబ్బందితో తలనొప్పులు.. పరేషాన్‌లో సీఎం, మంత్రులు
పర్సనల్ స్టాఫ్ ప్రవర్తన తీరుతో ముఖ్యమంత్రి, మంత్రులకు కొత్త చిక్కులు తప్పడం లేదని తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: పర్సనల్ స్టాఫ్ ప్రవర్తన తీరుతో ముఖ్యమంత్రి, మంత్రులకు కొత్త చిక్కులు తప్పడం లేదని తెలుస్తోంది. వ్యక్తిగత సిబ్బంది సొంత రూల్స్‌తో నానా హడావుడి చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చాంబర్‌లోకి ఎవరిని పంపాలో.. ఎప్పుడు పంపాలో సదరు సిబ్బందే డిసైడ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఎమర్జెన్సీ పనుల కోసం వచ్చే ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ లీడర్లకు సైతం కండీషన్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజాప్రతినిధులు బయటికు వచ్చి బండబూతులు తిడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సపోర్టుగా ఉండాల్సిన వ్యక్తిగత స్టాఫ్ తీరు తమ బాస్‌లకు సమస్యగా మారడం అసలుకే మోసం వచ్చేలా ఉన్నదనే చర్చ పార్టీలో జరుగుతున్నది.
బెదిరింపులు, సెటైర్లు
వివిధ పనుల కోసం ముఖ్యమంత్రి, మంత్రుల వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కేడర్ పట్ల వారి వ్యక్తిగత సిబ్బంది, పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. చాంబర్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలున్నాయి. మంత్రులు ఏదైనా మీటింగులో ఉంటే లోనికి వెళ్లకుండా ఆపితే పర్లేదు. కానీ, సదరు మంత్రులు చాంబర్‌లో, అటాచ్ రూమ్‌లో ఖాళీగా ఉన్న టైంలోనూ పంపించడం లేదని మండిపడుతున్నారు. ‘సార్ లోపల బిజీగా ఉన్నారు. ఫ్రీ అయ్యాక పిలుస్తారు’ అని గంటల కొద్ది కూర్చోబెడుతున్నట్లు విమర్శలున్నాయి. అయితే, ఈ అవమానాలు సాధారణ లీడర్లకు ఎదురైతే పెద్ద విషయమేమీ కాదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ లీడర్లు సైతం ఆ బాధితుల లిస్టులో ఉన్నట్లు సమాచారం. అయితే, కొన్ని సార్లు అక్కడున్న పర్సనల్ స్టాఫ్, సెక్యూరిటీ మాటలు పట్టించుకోకుండా లోనికి వెళ్తే బయటికు వచ్చాక ఆ కోపాన్ని పక్కనున్న వారిపై చూపుతూ పరోక్షంగా బెదిరింపులకు దిగడం, మరికొందరు సెటైర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది.
బాస్‌ల ఆదేశాలా.. సొంత రూల్సా?
విజిటర్స్ పట్ల ఆంక్షలు పెట్టడం వెనుక ఎవరి ప్రమేయం ఉందనే చర్చ ప్రస్తుతం జరుగుతున్నది. బాస్‌ల ఆదేశాల మేరకే పర్సనల్ స్టాఫ్ అలా పని చేస్తున్నారా? లేకపోతే సొంతంగానే నిర్ణయాలు తీసుకుని ఆంక్షలు అమలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బాస్‌ల అదేశాల మేరకే పనిచేసినా.. వారికి తెలియకుండానే స్టాఫ్ సొంతంగా రూల్స్ అమలు చేసినా.. అటు పార్టీకి, ఇటు సదరు లీడర్లకు చెడ్డపేరు తెస్తుందని చర్చ జరుగుతున్నది. కొందరు మంత్రుల వద్ద పనిచేసే వ్యక్తిగత స్టాఫ్ మంత్రుల కంటే ఎక్కువగా అహం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మంత్రులను ఎందుకు కలుస్తున్నారో తమకు చెప్పాలని కండీషన్లు పెడుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. దీనితో అక్కడికి వచ్చిన సీనియర్ లీడర్లు సైతం చాలా సార్లు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
చెప్పుకోలేని అవమానాలు..
మంత్రులను కలిసేందుకు సెక్రెటేరియట్‌కు వెళ్లిన కొందరు కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా స్థాయి లీడర్లకు చెప్పుకోలేని అవమానాలు జరిగినట్లు తెలిసింది. లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే డోర్ దగ్గరే ఆపేయడం, తాము ఫలానా అని చెప్పుకునేందుకు కూడా టైమ్ ఇవ్వకుండా నెట్టేస్తున్నట్లు టాక్. వారిని కాదనిలోనికి వెళ్లేందుకు ధైర్యం చేస్తుంటే, చేతులు, మోకాళ్లతో శరీరంలోని సున్నితమైన ప్రాంతాలను గాయపరిచిన ఘటనలూ ఉన్నాయని బాధిత లీడర్లు ఆవేదన చెందుతున్నారు.
బీఆర్ఎస్ టైంలోనూ ఇదే కల్చర్..
బీఆర్ఎస్ హయాంలోనూ సీఎం, మంత్రుల వద్ద పనిచేసే స్టాఫ్ ఇదే తరహాలో వ్యవహరించే వారని విమర్శలున్నాయి. లోనికి వెళ్లాలంటే అక్కడున్న పర్సనల్ సిబ్బంది, సెక్యూరిటీని మచ్చిక చేసుకునేవారు. కొందరు స్టాఫ్ మంత్రుల అప్డేట్ చెప్పేందుకు లీడర్ల నుంచి ముడుపులు తీసుకుని సమాచారం ఇచ్చేవారని టాక్ ఉంది. ప్రగతిభవన్‌లోకి వెళ్లేందుకు అక్కడున్న సెక్యూరిటీకి ఎంతో కొంత ముట్ట చెబితేనే ఎంట్రీ ఇచ్చేవారని విమర్శలున్నాయి.
* ఈ మధ్య ఓ పర్సనల్ స్టాఫ్ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా చేసిన హడావుడి ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో ఆ విషయంపై ఢిల్లీ పెద్దలు ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో మంత్రులు రంగంలోకి దిగి తమ స్టాఫ్‌కు క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.
* దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి వద్దకు వచ్చే విజిటర్స్ ముందుగా అక్కడ పని చేస్తోన్న పర్సనల్ స్టాఫ్‌ను కలవాలి. అన్ని వివరాలు చెప్పాలి. ఆ తర్వాతే లోనికి పంపుతారు.
* ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి వద్ద పనిచేసే ఓ లేడీ స్టాఫ్ అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటారనే విమర్శలున్నాయి. ఏం తెలియకున్నా అన్ని తెలుసు అనే విధంగా సీనియర్ లీడర్ల వద్ద పోజులు కొడుతారని టాక్.
* అలాగే, ఓ మంత్రి వద్దకు వచ్చే లీడర్లను అక్కడ పనిచేస్తోన్న ఓ స్టాఫ్ దురుసుగా ప్రవర్తిస్తుండంతో కొందరు ఎమ్మెల్యేలు ఆయనపై సదరు మంత్రికి ఫిర్యాదు చేశారు.
*ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ మంత్రి వద్దకు వెళ్లనివ్వకుండా నెట్టేయడంతో ఓ సీనియర్ లీడర్ ఆ ఆఫీసర్‌పై అక్కడే గొడవకు దిగారు.
*ప్రతి ఫైల్ తనకు తెలియకుండా మంత్రి వద్దకు వెళ్లొద్దని ఓ మంత్రి వద్ద పనిచేసే ఓ పర్సనల్ స్టాఫ్ ఆంక్షలు పెట్టినట్లు టాక్.
*దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రికి ఫోన్ చేయాలంటే ముందుగా ఆయన వద్ద పని చేసే పర్సనల్ సెక్రెటరీకి చేయాలి. అయనకే అన్ని విషయాలు చెప్పాలి. అయన ఒకే అనుకుంటేనే మంత్రికి ఫోన్ ఇస్తారు. లేకపోతే పక్కన పెడుతారనే టాక్ ఉంది.






