- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెచ్‌సీఏ టీజీ20 కుంభకోణం..ఖాతాలు ఫ్రీజ్ చేయాలని ఆదేశాలు!
టీజీ20 లీగ్ వ్యవహారంలో అవినీతి జరిగిందని, ఏకంగా రూ.46.15 కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాంబు పేల్చింది.

దిశ,తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్భాటంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ వ్యవహారంలో అవినీతి జరిగిందని, ఏకంగా రూ.46.15 కోట్ల కుంభకోణం చోటు చేసుకుందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాంబు పేల్చింది. హెచ్‌సీఏ కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని రాష్ట్ర లోకాయుక్త రెండు రోజుల క్రితమే ఆదేశించిన నేపథ్యంలో.. టీసీఏ జనరల్ సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి శనివారం సీఐడీ అదనపు డీజీ చారుసిన్హాను కలిసి ఫిర్యాదు సమర్పించారు. బీసీసీఐ అనుమతులు లేకుండానే కార్పొరేట్ సంస్థలను, స్టార్ క్రికెటర్లను, సినీ ప్రముఖులను మోసం చేస్తూ అనధికారిక బ్యాంకు ఖాతాల్లోకి కోట్లాది రూపాయలు మళ్లించారని ఆధారాలతో సహా సీఐడీకి ఫిర్యాదు చేశారు. జూన్ 21న ఉప్పల్ స్టేడియంలో ఈ లీగ్ ప్రారంభం కానున్న దృష్ట్యా.. తక్షణమే ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసి, హెచ్‌సీఏ పెద్దలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీసీఏ డిమాండ్ చేసింది.
షాడో అకౌంట్.. కార్పొరేట్ల నుంచి భారీ వసూళ్లు...
టీజీ20 లీగ్ పేరుతో హెచ్‌సీఏ పెద్దలు ఒక షాడో ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ ను సృష్టించారని టీసీఏ తన ఫిర్యాదులో ఆరోపించింది. జనరల్ బాడీ ఆమోదం, ఆడిటింగ్ లేకుండానే అక్రమంగా కెనరా బ్యాంకులో టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ హెచ్‌సీఏ పేరిట కరెంట్ ఖాతాను తెరిచారని సీఐడీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఏడాది మే 23న ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫ్రాంచైజీల వేలం పేరుతో అక్రమంగా తెలంగాణలోని ఎనిమిది జిల్లాల పేర్లను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అమ్ముకున్నారని ఆరోపించింది. తద్వారా ఆ అనధికారిక ఖాతాలోకి ఏకంగా రూ.46.15 కోట్లు నిధులను మళ్లించారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్‌కు పాల్పడ్డారని టీసీఏ ఫిర్యాదులో స్పష్టం చేసింది.
స్టార్లకు వల.. అనుమతుల పేరుతో పచ్చి అబద్ధాలు...
బీసీసీఐ నియమావళిలోని రూల్ 31, హెచ్‌సీఏ నిబంధన రూల్ 28 ప్రకారం.. ఫ్రాంచైజీ లీగ్ నిర్వహించాలంటే జనరల్ బాడీ మీటింగ్ తో పాటు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నుంచి 45 రోజుల ముందే లిఖితపూర్వక అనుమతులు తీసుకోవాలి. కానీ, హెచ్‌సీఏ సెక్రటరీ ఎం.జీవన్ రెడ్డి, టీజీ20 చైర్మన్ వి.అగమ్ రావు ఈ నిబంధనలను గాలికొదిలేసి, తమకు బీసీసీఐ అనుమతులు ఉన్నాయంటూ మార్చి 6న, మే 6న బహిరంగంగా తప్పుడు ప్రెస్ రిలీజ్ చేశారని టీసీఏ ఆరోపించింది. ఈ అబద్ధపు అనుమతుల పేరుతో అంతర్జాతీయ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, అంబటి రాయుడు, తిలక్ వర్మలతో పాటు టాలీవుడ్ స్టార్లు విజయ్ దేవరకొండ, వెంకటేష్ దగ్గుబాటి తదితరులను తప్పుదోవ పట్టించి ఈ వివాదాస్పద లీగ్‌లోకి లాగారని సీఐడీకి వివరించింది. భవిష్యత్తులో ఈ లీగ్‌పై న్యాయపరమైన చిక్కులు వస్తే, అందులో పాల్గొన్న ఆటగాళ్ల కెరీర్ నాశనం కావడంతో పాటు, వందల కోట్ల న్యాయపరమైన దావాలు తప్పవని హెచ్చరించింది.
ఆ 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి...
ఈ కుంభకోణానికి బాధ్యులైన హెచ్‌సీఏ సెక్రటరీ ఎం.జీవన్ రెడ్డి, టీజీ20 చైర్మన్ వి.అగమ్ రావు, కోశాధికారి డాక్టర్ కే.అనిల్ కుమార్, హెచ్‌సీఏ సీఈవో ఇంతియాజ్ ఖాన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు దల్జీత్ సింగ్, బసవరాజ్, సునీల్ కుమార్ అగర్వాల్, పంత్ సత్వాలేకర్, రాజశేఖర్ దస్తగిరి, సి.సంజీవ్ రెడ్డి సహా పది మంది పై పలు సెక్షన్ కింద తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని టీసీఏ డిమాండ్ చేసింది. వీటితో పాటు ఉప్పల్ స్టేడియంలోని హెచ్‌సీఏ ప్రధాన కార్యాలయంపై వెంటనే దాడులు చేసి, మీటింగ్ మినిట్స్, తీర్మానాలు, గ్రాంట్ థార్న్‌టన్ , టీసీఎం స్పోర్ట్స్ సంస్థలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను సీజ్ చేయాలని సీఐడీని కోరింది. 46 కోట్ల నిధులు దారిమళ్లకుండా వెంటనే కెనరా బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న శ్రీనిధి యూనివర్సిటీకి, మ్యాచ్‌లను ప్రసారం చేయనున్న బ్రాడ్‌కాస్టర్లకు జియో స్టార్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఈ లీగ్ చట్టబద్ధత లేనిదని వివరిస్తూ తక్షణమే చట్టపరమైన నోటీసులు జారీ చేసి, లీగ్‌ను అడ్డుకోవాలని టీసీఏ సీఐడీని అభ్యర్థించింది.






