- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హ్యామ్ టెండర్లపై హరీష్ ఆరోపణలు అర్థరహితం: మంత్రి కోమటిరెడ్డి
హ్యామ్ రోడ్ల టెండర్లపై హరీష్ రావు ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తిప్పికొట్టారు. నిబంధనల ప్రకారమే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నామని, పారదర్శకంగా జరిగిన టెండర్లపై విమర్శలు తగదని స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల టెండర్లపై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. జాతీయ స్థాయిలో విజయవంతమైన నమూనాను అనుసరిస్తుంటే, అవగాహన లేకుండా రాజకీయ విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్) ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని ఎన్.హెచ్.ఎ.ఐ 2016 నుంచే అమలు చేస్తోందని, ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల వ్యయంతో వందలాది ప్రాజెక్టులు పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు.
గత ఉత్తర్వుల మేరకే..
మొబిలైజేషన్ అడ్వాన్స్‌పై హరీష్ రావు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. ఇది కొత్తగా తెచ్చిన నిబంధన కాదని, 2003 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉన్నదేనని మంత్రి స్పష్టం చేశారు. "రూ. 13,000 కోట్ల పనులకు 10 శాతం అడ్వాన్స్ అంటే రూ. 1,300 కోట్లు మాత్రమే. ఇది ఉచితంగా ఇచ్చేది కాదు, దీనిపై బ్యాంక్ వడ్డీ వసూలు చేయడమే కాకుండా, కాంట్రాక్టర్ల రన్నింగ్ బిల్లుల నుంచి పది విడతల్లో రికవరీ చేస్తాం" అని కోమటిరెడ్డి వివరించారు. ఈ అడ్వాన్స్ తీసుకోవడం కాంట్రాక్టర్లకు తప్పనిసరి కాదని, వడ్డీ భారం ఉంటుంది కాబట్టి అవసరమైన వారే తీసుకుంటారని తెలిపారు.
టెండర్లలో అంచనాలు పెరిగాయన్న ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ.. నిర్మాణ వ్యయంలో 18 శాతం ఉన్న జీఎస్టీని ప్రభుత్వం 15 ఏళ్ల కాలంలో వడ్డీ లేకుండా తిరిగి చెల్లిస్తుందని, ఈ ఆలస్యం వల్ల కాంట్రాక్టర్‌పై పడే 9.30 శాతం అదనపు భారం బిడ్లపై ప్రభావం చూపిందని వెల్లడించారు. దీనికి తోడు 15 ఏళ్ల పాటు అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనాల నిర్వహణ ఖర్చులను అంచనాల్లో చేర్చలేదని, అందుకే బిడ్డర్లు 15 నుంచి 23 శాతం వరకు అధికంగా కోట్ చేశారని వివరించారు. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా 40 నుంచి 60 శాతం వరకు అధికంగా టెండర్లు వెళ్లిన దాఖలాలు ఉన్నాయని మంత్రి గణాంకాలతో సహా వివరించారు. పారదర్శకంగా ఈ-ప్రొక్యూర్‌మెంట్ వేదిక ద్వారా జాతీయ స్థాయి కంపెనీలు పాల్గొన్న ఈ టెండర్లపై బురద జల్లడం మానుకోవాలని హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.






