రేవంత్ మనసులో మాటను కోదండరెడ్డి బయటపెట్టారు

by velandi.Saikiran |

ఈఆర్సీ ముందు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. రేవంత్ మనసులో మాట బయట పెట్టారని హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

రేవంత్ మనసులో మాటను కోదండరెడ్డి బయటపెట్టారు
X

రైతు డిస్కం పేరిట నాటకాలు

- రేవంత్ మనసులో మాటను కోదండరెడ్డి బయటపెట్టారు

- 24 గంటల కరెంటుకు కోత పెట్టేందుకు కుట్రలు

- యావత్ రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతుంది

- మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు

దిశ, తెలంగాణ బ్యూరో: ఈఆర్సీ ముందు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. రేవంత్ మనసులో మాట బయట పెట్టారని మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కం పేరిట చేస్తున్న నాటకాలు 24 గంటల కరెంట్‌కు కోత పెట్టేందుకేనా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ రైతాంగం బుద్ధి చెబుతుందంటూ హెచ్చరించారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదని.. 3 గంటల కరెంట్ చాలని ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయని పేర్కొన్నారు. ఇది కోదండరెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదని.. రేవంత్‌రెడ్డి మనసులోని ఆలోచన అని ఆరోపించారు. అమెరికా వేదికగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

పొలం అంటే ఏమిటో.. బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో.. రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతాడో.. తెలియని వాళ్లు మాత్రమే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడగలరని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టిందని వెల్లడించారు. కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. రుణమాఫీ అటకెక్కించారని.. రైతుబంధు బంద్ చేశారని.. పంట బోనస్ బోగస్ చేశారని.. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయ్యారని.. పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారని.. ఇవి చాలవన్నట్లు 24 గంటల కరెంట్‌ను ప్రణాళిక ప్రకారం ఖతం పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నదని హెచ్చరించారు.

Next Story