యూరియాపై బ్యాన్ ఏంటి?.. రైతుల ఉసురు పోసుకోకండి: రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

by Gantepaka Srikanth |

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

యూరియాపై బ్యాన్ ఏంటి?.. రైతుల ఉసురు పోసుకోకండి: రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై అప్రకటిత నిషేధం విధించడం చరిత్రలో ఎన్నడూ లేని దిక్కుమాలిన చర్య అని ఆయన మండిపడ్డారు. మంగళవారం హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రాష్ట్రంలో స్టాక్ ఉన్నప్పటికీ డీలర్లు, అగ్రో సెంటర్లు, సొసైటీల్లో రైతులకు యూరియా ఎందుకు ఇవ్వడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. "యూరియా అమ్మకాలు నిలిపివేయాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇవ్వడం దారుణం. చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు ఎరువుల కోసం అల్లాడుతుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా?" అని నిలదీశారు. ఎరువుల కష్టాలను తీర్చాల్సింది పోయి, కొత్తగా తెచ్చిన యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు డిక్లరేషన్ 'అట్టర్ ఫ్లాప్'..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి విషయంలోనూ విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైఫల్యాలను ఆయన ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. రైతు బంధు ఇవ్వడంలో, రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యింది. పంటలకు బోనస్ చెల్లించడంలో, పంట బీమా పథకం అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో విఫలమై రైతులను ఆందోళనలోకి నెట్టారు. యూరియా సరఫరాను పక్కనపెట్టి, వినియోగం తగ్గించాలంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.

వారోత్సవాల పేరిట డ్రామాలు..

"ఒకవైపు రైతులు కష్టాల్లో ఉంటే, మరోవైపు ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహించడం వారిని అవమానించడమే. ఈ వైఫల్యాలను కవర్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు చేస్తోంది. రైతుల ఉసురు పోసుకుంటున్న పాపం ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదు" అని హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో రైతుల నిలదీతకు భయపడి అధికారులు రైతు వేదికల నుంచి పారిపోయే పరిస్థితి రావడం పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో మాదిరిగా నిరంతరం యూరియా అమ్మకాలు కొనసాగించాలని, వెంటనే అనధికారిక బ్యాన్‌ను ఎత్తివేసి రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Next Story