- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధారాలతో సహా అన్నీ బయటపెడుతాం: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హ్యామ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆధారాలతో సహా తాము బయట పెట్టామని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హ్యామ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆధారాలతో సహా తాము బయట పెట్టామని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ లో 25 టెండర్ లను ఎక్సెస్ టెండర్లతో కొందరికి మాత్రమే కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆనాడే చెప్పినట్లు తెలిపారు. తాము చెప్పిందే నిజమైందని, హ్యామ్ మోడల్ రోడ్ల టెండర్లో 25 శాతం ఎక్సెస్ తో టెండర్ వేశారని ఆరోపించారు. శుక్రవారం ఆయన ఈ అంశంపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. హ్యమ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని అన్నారు. ఆర్ అండ్ బీ లో రూ. 11 వేల కోట్లకు టెండర్ పిలిస్తే ఎక్సెస్ తో కలిసి దాదాపుగా రూ.15 వేల కోట్ల వరకు, పంచాయతీరాజ్ లో రూ.6 వేల కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపుగా రూ.7 నుంచి రూ.8 వేల కోట్ల వరకు అవుతోందన్నారు. ఎక్సెస్ టెండర్ వల్ల రూ. 5 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. హ్యమ్ మోడల్ రోడ్ల కోసం 60 శాతం బ్యాంకు నుంచి అప్పు తెచ్చి 30 ఇన్స్టాల్ మెంట్ లో 15 సంవత్సరాల పాటు వడ్డీతో సహా బ్యాంకుకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజల పై తీవ్రమైన భారంతో పాటుగా రాబోయే ప్రభుత్వాలపై ఊహించని భారం పడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చేసే అప్పులతో పాటుగా, పరోక్షంగా అప్పులు చేస్తున్నాడని ఆరోపించారు. ఈ టెండర్ లలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల కోసం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోరాడాడని గుర్తుచేశారు. అప్పుడు అలా మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెచ్చాడని ఎద్దేవా చేశారు.
ఆధారాలతో సహా వివరించాం..
2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. తమ హయంలో 5 శాతం కంటే ఎక్కువగా టెండర్ ఉంటే వెంటనే రీ కాల్ చేసేవాళ్ళమని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం టెండర్ ఎక్సెస్ వేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. ఎక్సెస్ టెండర్ లను వెంటనే రద్దు చేయాలని, టెండర్లన్నీ రీ కాల్ చెయ్యాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతోందని.. ఇదే విషయాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆధారాలతో సహ మేము వివరించామమన్నారు. రేవంత్ రెడ్డి ఇవ్వాళ ఉంటాడు, రేపు పోతాడని... ఎక్సెస్ టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పై భారం పడుతుందన్నారు. ఈ టెండర్లలో ఒక కంపెనీకి 15 టెండర్ లు దక్కబోతున్నాయని... త్వరలోనే ఆధారాలతో సహా అన్ని విషయాలు బయటపెడుతామని హెచ్చరించారు. ఆర్ అండ్ బీ లో రిటైర్ అయిన చీఫ్ ఇంజనీరింగ్ వెంకటేశ్వరరావు, పంచాయితీ రాజ్ చీఫ్ ఇంజనీర్ జోగారెడ్డి పదవి కాలం పొడిగించి ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారని... ప్రధానమైన ఇంజనీరింగ్ లో ముఖ్యమైన అధికారులను ఎక్స్ టెన్షన్ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అడ్వైజర్లు ఉండరని, ఎక్స్ టెన్షన్ ఉండదన్న సీఎం... అధికారంలోకి రాగానే ప్రధానమైన ఇంజనీరింగ్ శాఖలో అధికారులను ఎక్స్ టెన్షన్ ఇస్తున్నారని విమర్శించారు.






