కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. స్పందించిన హరీష్ రావు

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-15 12:48:16  IST  )

ఫార్ములా-ఈ కార్ రేసు కేసు(Formula-E Race Case)లో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌(KTR)కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. స్పందించిన హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా-ఈ కార్ రేసు కేసు(Formula-E Race Case)లో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌(KTR)కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఆ పార్టీ నేత హరీష్ రావు(Harish Rao) స్పందించారు. ఈ మేరకు హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధించే తప్ప మరొకటి కాదు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి కేటీఆర్‌కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనం. కాంగ్రెస్(Congress) ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు పంపించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలల పాలన‌లో డైవర్షన్ పాలిటిక్స్‌ను అమలు చేస్తూ బీఆర్ఎస్‌ను బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డి డ్రామా, డైవర్షన్ రాజకీయాలు ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయి. ఫార్ములా ఈ రేసింగ్‌తో తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. పెట్టుబడులు కూడా వచ్చాయి. అది రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారు. 2000లో చంద్రబాబు ఫార్ములా వన్ కోసం కృషిచేసి నిర్వహించలేకపోయాడు. అలాంటిది కేటీఆర్ కృషి వల్ల ఫార్ములా వన్ వంటి ప్రతిష్టాత్మక రేస్‌ను భారతదేశానికి అందులోనూ హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తెలంగాణను మార్చేందుకు ఫార్ములా ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించారు.

అమర్ రాజా వంటి కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువును, దేశ పరువును మంటకలిపింది. అందాల పోటీతో లాభం లేదు కానీ రాష్ట్ర పరువు మాత్రం తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నందుకు కేటీఆర్‌కి ఏసీబీ నోటీసులు ఇచ్చిందని స్పష్టమైతున్నది. రేవంత్ రెడ్డి.. నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా నీ వైఫల్యాలను ఎండగట్టడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆపదు’ అని హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Click Here For Twitter Post ...

Next Story