రాత్రికి రాత్రే వందల కోట్లు విడుదల.. హరీష్ రావు ట్వీట్ వైరల్

by Gantepaka Srikanth |

రెండున్నరేళ్లుగా బిల్లులు రాక, అప్పులపాలై తీవ్ర మనోవేదనకు గురవుతున్న 'మన ఊరు మన బడి' సివిల్ కాంట్రాక్టర్లు ఈరోజు నన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు.

రాత్రికి రాత్రే వందల కోట్లు విడుదల.. హరీష్ రావు ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండున్నరేళ్లుగా బిల్లులు రాక, అప్పులపాలై తీవ్ర మనోవేదనకు గురవుతున్న 'మన ఊరు మన బడి' సివిల్ కాంట్రాక్టర్లు ఈరోజు నన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు. ఈ మేరకు హరీష్ రావు ట్వీట్ చేశారు. ‘కేసీఆర్ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాం. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తోంది. అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తీలు కట్టలేక రోడ్డున పడ్డారు. అప్పుల బాధతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. చిన్న కాంట్రాక్టర్లకు పైసల్లేవంటున్న ప్రభుత్వం.. పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే వందల కోట్లు ఎలా విడుదల చేసింది? మీకు కమీషన్లు ఇవ్వరనే ఈ చిన్న కాంట్రాక్టర్లను బిల్లును గాలికి వదిలేశారా ముఖ్యమంత్రి గారు’ అని హరీష్ రావు ప్రశ్నించారు.

ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట..

‘తమ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ప్రజావాణిలో మొరపెట్టుకున్నా, విద్యాశాఖ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని వేడుకున్నా స్పందన లేదు. చివరికి, సచివాలయంలో ఆర్థిక మంత్రి చాంబర్ ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపితే.. వారిపై అక్రమ కేసులు బనాయించడం ఈ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై శాసనమండలి చైర్మన్ మండలి సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు మన బడి బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయని, తమ సొంత ఊరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. బిల్లులు విడుదల చేయాలని తాను స్వయంగా ముఖ్యమంత్రిని కోరినా.. బిల్లులు విడుదల చేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.

కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టకండి..

కనీసం ఇప్పుడైనా మన ఊరు - మన బడి కోసం ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖకు వచ్చిన నిధులనైనా.. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న సివిల్ కాంట్రాక్టర్లకు చెల్లిస్తారా? లేక ఆ డబ్బును కూడా కూడా బడా కాంట్రాక్టర్లకే కట్టబెడతారా?. పేద పిల్లల కోసం పాఠశాలలు బాగుచేసిన చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులు పెట్టకండి. వెంటనే ఆ 1500 మంది పెండింగ్ బిల్లులను విడుదల చేసి, వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

Next Story