- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమిషన్‌కు పక్కా ఆధారాలు సమర్పించా.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కాసేపటి ముగిసింది.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కాసేపటి ముగిసింది. ఈ మేరకు హైదరాబాద్ (Hyderbad)లోని బీఆర్కే భవన్‌లో విచారణకు హాజరైన నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao)ను కమిషన్ చైర్మన్ జస్టిస్ పి.చంద్రఘోష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 45 నిమిషాల పాటు జరిగిన బహిరంగ విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్ ముందు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. కమిషన్‌కు పక్కా ఆధారాలు సమర్పించానని.. కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇచ్చానని తెలిపారు. అదేవిధంగా అధారాలను కూడా సమర్పించానని పేర్కొన్నారు. విచారణలో భాగంగా తమ్మిడిహట్టిని నుంచి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఎందుకు మేడిగడ్డకు మార్చారనే అనే విషయంపై చాలాసేపు డిస్కషన్ జరిగిందని అన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక తమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ప్రయత్నం చేశామని.. కానీ, ఆ తర్వాత రివ్యూలో అంతకు ముందున్న ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని పేర్కొన్నారు. తల దగ్గర పనులు ప్రారంభించకుండా.. తోక వద్ద పనులు స్టార్ చేశారని తెలిపారు. ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో.. అక్కడి నుంచి పని మొదలు పెట్టకుండా ఎక్కడెక్కడో కాలువలు, టన్నెల్స్ తవ్వారని పేర్కొన్నారు. తమ్మిడిహట్టి ప్రాజెక్ నిర్మాణం విషయంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఐదారు సమావేశాలు జరిగాయని అన్నారు. 152 మీటర్ల ఎత్తులో తమ్మడిహట్టి ప్రాజెక్ట్ కట్టేందుకు ఏడేళ్ల నుంచి ఒప్పుకోవడం లేదని ఆనాడే మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ చెప్పారని పేర్కొన్నారు. ఆ విషయంలో పృథ్విరాజ్ చౌహాన్, అప్పటి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ మీటింగ్‌ల సారాంశంతో పాటు మినిట్స్ కాపీలను కూడా కమిషన్‌కు అందజేశానని హరీశ్ రావు తెలిపారు.
ప్రత్యామ్నాయం చూసుకొమ్మని చెప్పిందే వాప్కోస్..
అనంతరం మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంతో కూడా తాము తమ్మడిహట్టిపై చర్చలు జరిపామని కేసీఆరే స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు సమక్షంలోనే సీఎం ఫడ్నవీస్‌కు చెప్పే ప్రయత్నం చేశారని తెలిపారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్‌ను కట్టేందుకు అనుమతించాలని ఎంత నష్ట పరిహారమైనా ఇస్తామని స్పష్టంగా చెప్పినా ఏడేళ్లు మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు తాము ఒప్పుకుంటామని మహారాష్ట్ర సీఎం చెప్పారని పేర్కొన్నారు. ఏడేళ్లలో రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణానికి అడుగు ముందుకు పడలేదని అన్నారు. కానీ, తాము అధికారంలోకి వచ్చాక అక్కడే ప్రాజెక్ట్ నిర్మాణించేందుకు ప్రయత్నం చేశామని అన్నారు. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా సీడబ్ల్యూసీ తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవంటూ.. ప్రత్యామ్నాయం చూసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు లేఖలు రాసిందని, రిజర్వాయర్ల సంఖ్యను కూడా పెంచుకోవాలని సూచించిందని వివరించారు. ఆ లెటర్లను కూడా కమిషన్‌కు అందజేశానని హరీశ్ రావు తెలిపారు తమ్మిడిహట్టి దగ్గర నీళ్ల లభ్యత లేదని చెప్పిన నేపథ్యంలో ఏం చేయాలని.. ప్రత్యామ్నాయం సూచించండి అని వాప్కోస్‌కు సీఎం కేసీఆర్ లేఖ రాశారని హరీశ్ రావు తెలిపారు. వాప్కోస్ అల్లాటప్పా.. డిపార్ట్‌మెంట్ కాదని అది కూడా సీడబ్ల్యూసీలో ఓ అంతర్భాగమని అన్నారు. నాడు ఆ వాప్కోస్ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందంటూ డీయిటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఆ వివరాలు కూడా కమిషన్‌కు అందజేశానని అన్నారు. సీడబ్ల్యూసీ, వాప్కోస్ సూచనలను మేరకు, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం వల్ల ఇంజినీర్ల రికమెండేషన్ మేరకు బ్యారేజీని తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని అన్నారు.
ప్రభుత్వ డొల్లతనం బయటపడింది..
కాళేశ్వరాన్ని కొంతమంది కూలేశ్వరం అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్‌హౌజ్‌లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కెనాల్స్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగమే కాళేశ్వరం ప్రాజెక్ట్ సమాహారమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే గంధమల్లకు శంకుస్థాపన చేశారని.. అక్కడికి నీళ్లు మల్లన్న సాగర్ నుంచి పోయేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగం కాదా.. అని ప్రశ్నించారు. మరోవైపు హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణకు 30 టీఎంసీల నీళ్లు తీసుకొస్తామని అంటున్నారని.. అవి కూడా మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నామని టెండర్లు పిలుస్తున్నారని కామెంట్ చేశారు. ఇన్ని చేసుకుంటూ మళ్లీ కాళేశ్వరం కూలింది అంటూ కాంగ్రెస్ నేతలను నోటికొచ్చినట్లుగా వాగుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వ డొల్లతనం పూర్తిగా బయటపడిందని.. ఎప్పటికైనా తెలంగాణకు లైఫ్‌లైన్ ఒక్క కాళేశ్వరమేనని విషయం కూడా ప్రజలకు స్పష్టమైందని అన్నారు. కమిషన్ ఎదుట కూడా తాను నొటికి ఏది వస్తే అది మాట్లాడలేదని.. ప్రతి ఒక్కటి సాక్ష్యాధారలతో సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు డాక్యుమెంట్ ఎవిడెన్స్ రూపంలో వారికి అందజేశానని హరీశ్ రావు స్పష్టం చేశారు.






