Harish Rao: మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు

by Gantepaka Srikanth |

‘సీఎం రేవంత్‌రెడ్డి కాదు. ఆయన గోబెల్స్ రెడ్డి. అన్నీ మాట తప్పుడే. ఒక్కటీ చేయడు. నిజాలు మాట్లాడొద్దు అనే శాపం రేవంత్‌రెడ్డికి ఉన్నట్లుంది’ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు.

Harish Rao: మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘సీఎం రేవంత్‌రెడ్డి కాదు. ఆయన గోబెల్స్ రెడ్డి. అన్నీ మాట తప్పుడే. ఒక్కటీ చేయడు. నిజాలు మాట్లాడొద్దు అనే శాపం రేవంత్‌రెడ్డికి ఉన్నట్లుంది’ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మూసీ అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌‌లో విధ్వంస ఖాండను కొనసాగిస్తున్నారని.. ప్రజల ఇండ్లు కూల్చే హక్కు ఎవరిచ్చారు రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. మూసీ బ్యూటిఫికేషన్ మీద సీఎం ఫైవ్ స్టార్ హోటల్‌లో ప్రజెంటేషన్ ఇస్తున్నారని.. మీరు చేస్తున్నది ఎకలాజికల్ ప్యూరిఫికేషనా? లేదా ఆస్తటిక్ బ్యూటిఫికేషనా? అని నిలదీశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా, బాధితుల పక్షాన కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నామని.. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పునరుజ్జీవనానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని.. మూసీ పేరిట రేవంత్ చేస్తున్న లూటిఫికేషన్‌కు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన మీద చిత్తశుద్ధి ఉన్న వారెవరూ ముందే పేదల ఇండ్ల మీద పడరని అన్నారు.

ప్రక్షాళన ఎలా చేస్తారు?

వికారాబాద్ నుంచి ఇక్కడివరకు మురుగు నీటిని ఆపకుండా ప్రక్షాళన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఒక దిక్కు ఖజానా ఖాళీ అంటూనే.. ఏకంగా లక్షా 50వేల కోట్లకు రేవంత్ టెండర్ పెట్టారని ఆరోపించారు. ఇక్కడ పాలన చేతకాదు గానీ, పాలన అద్భుతమని పక్క రాష్ట్రాల్లో కోట్లు ఖర్చు చేసి పేపర్ ఆడ్స్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో కూర్చొని ప్రణాళిక రచిస్తున్నారని.. ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఇన్ని రోజులు పేదల ఇండ్లు కూల్చారా అని నిలదీశారు. మూసీని బాగు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరగాలని.. అక్కడి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ప్రకారం 3279.19 ఎకరాల్లో ఉన్న 10,017 నిర్మాణాలను కూల్చుతున్నారని.. అంటే లక్ష మంది జీవితాలు కూల్చుతున్నారని.. గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి ఇన్ని ఇండ్లు కూల్చడం అవసరమా అని నిలదీశారు. గల్ఫ్ దేశాల్లో బాంబులు వేస్తూ ఇండ్లు కూల్చుతుంటే, ఇక్కడ రేవంత్‌రెడ్డి బుల్‌డోజర్లతో విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఎలాంటి డీపీఆర్ లేకుండా, ప్రణాళిక లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూల్చుతూ, భయబ్రాంతులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ బుల్డోజర్ రాజ్ రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

అసెంబ్లీ వేదికగా రేవంత్ పచ్చి అబద్ధం..

అసెంబ్లీ వేదికగా జనవరిలో సీఎం ఇచ్చిన సమాధానం ప్రకారం.. హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు అధ్యయనం చేసి డీపీఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుందన్నారని.. డీపీఆరే లేకుండా పేదలకు ఎలా నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. 10,017 ఇండ్లు కూల్చుతామని గెజిట్ ఎలా ఇచ్చారన్నారు. జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో సీఎం ఏడీబీ లోన్ రూ.4,100 కోట్లు మూసీకి ఇవ్వడానికి ఒప్పుకున్నదని.. మంజూరయ్యాయని చెప్పారని.. కానీ, ఏడీబీ మాత్రం తమకు డీపీఆర్ సమర్పించలేదని.. దాంతో లోన్ సాంక్షన్ చేయలేదని చెప్పిందని ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ పచ్చి అబద్ధం చెప్పారన్నారు. మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులకు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తానన్నారని.. మూసీ వెంట మొత్తం 46 కాలనీలు ఉన్నాయని.. వీళ్లకు సైతం అదే పద్ధతిలో స్థలం కేటాయిస్తారా అని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆవాసాలే కాకుండా మెట్రో రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చీలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నయి ఇవన్నీ కూల్చుతారా అని ప్రశ్నించారు. మూసీ పేరిట రేవంత్ చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాకు, దోపిడీకి బీజేపీ సహకరిస్తున్నదా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకా, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story