Harish Rao: ఆసుపత్రులు మూసుకునే పరిస్థితి

by Gantepaka Srikanth |

ఆరోగ్యశ్రీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు.

Harish Rao: ఆసుపత్రులు మూసుకునే పరిస్థితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరోగ్యశ్రీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 జూన్ 2వ తేదీ వరకు ఆరోగ్యశ్రీకి నెలకు రూ.32 కోట్లు ఖర్చు అయ్యేవని.. 2023 వరకు ఆ ఖర్చు రూ.68 కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం అది రూ.89 కోట్లు చేరిందన్నారు. దానికే తాము పెంచామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటున్నదని అన్నారు. ఇది సహజ పెరుగుదలనే కానీ.. కొత్తదనం ఏమీ లేదన్నారు. అలాగే.. కాంగ్రెస్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంచినట్లు గొప్పగా చెప్పుకుంటున్నా.. పది లక్షల పరిమితి వరకు ఎక్కడా ట్రీట్‌మెంట్ అందడం లేదని అన్నారు.

ఇప్పటివరకు కేవలం 496 మందికి మాత్రమే ఉపయోగపడిందన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగాయని.. చిన్నచిన్న ఆసుపత్రులు మూసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. తాము నిర్మాణం చేపట్టిన ఆసుపత్రుల గురించే సీఎం చెప్పుకొచ్చారని ఆరోపించారు. అయితే.. వాటిని పూర్తిచేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ ఆసుపత్రులు ఎప్పుడో పూర్తయ్యేవని పేర్కొన్నారు. అలాగే.. సీఎంఆర్ఎఫ్ కోసం తాము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామయని అన్నారు. ఈ అంశాలన్నీ చెప్పాలని అనుకుంటే సభలో తమకు మైక్ ఇవ్వలేదని ఆరోపించారు.

Next Story