Harish Rao: చేతకాని, బాధ్యతలేని, ముందుచూపు లేని ముఖ్యమంత్రి

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబుకు తాకట్టు పెట్టారా అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

Harish Rao: చేతకాని, బాధ్యతలేని, ముందుచూపు లేని ముఖ్యమంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: చేతకాని, బాధ్యతలేని, ముందుచూపు లేని రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖరి వల్ల కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని.. రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబుకు తాకట్టు పెట్టారా అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మొద్దు నిద్రను వదిలించేందుకే బీఆర్ఎస్ పక్షాన పదేపదే నిలదీస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గోదావరిలో ఉన్న 1,400 టీఎంసీల నీటిలో 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఏపీకి కేటాయించారని.. 968 టీఎంసీల హక్కులను స్థిరపరచడానికి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టి, 400 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు సాధించిన ఘనత కేసీఆర్‌ది అని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. కృష్ణాలో నీటి దోపిడీ చేసిన ఏపీ.. ఇప్పుడు ఆదమరిచి నిద్రపోతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వ చేతకానితనాన్ని ఆసరాగా చేసుకొని గోదావరి జలాలపై పడిందన్నారు.

జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారుల సమావేశం జరిగిందని.. ఆ మీటింగ్ ద్వారా తెలంగాణ నీటి హక్కులను హరించేందుకు ఏపీ పక్కా స్కెచ్ వేసిందని ఆరోపించారు. గోదావరిలో ఏ రాష్ట్రానికీ బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదని ఏపీ వాదించడం దుర్మార్గమని అన్నారు. ఢిల్లీ మీటింగ్‌కు సంబంధించిన మినిట్స్ ఫిబ్రవరి 12నే రాష్ట్రానికి వచ్చాయని.. నెల రోజులు దాటిపోయినా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టారా? లేక దాసోహం అయ్యారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను చైర్మన్‌గా చేసి దొంగ చేతికే తాళాలు ఇచ్చారని అన్నారు. కృష్ణా నదిలో కనీసం 34 శాతం తాత్కాలిక వాటాను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో 18 టెలిమెట్రీలు ఏర్పాటు చేశామని.. కానీ, టెలిమెట్రీల నిర్వహణకు ఇచ్చిన రూ.4.50 కోట్లను కేఆర్ఎంబీ అధికారులు తమ జీతాలకు వాడుకుని, బ్రిజేష్ కుమార్ అవార్డు వచ్చేదాకా కొత్త టెలిమెట్రీలు పెట్టేది లేదని తేల్చిచెప్పారని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అక్కడి గవర్నర్ ప్రసంగిస్తూ.. నల్లమల్ల సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి పనులు ముమ్మరం చేస్తున్నామని గర్వంగా చెప్పారని.. తెలంగాణ గవర్నర్ స్పీచ్‌లో నల్లమల్ల సాగర్‌ను అడ్డుకుంటామని, గోదావరిలో చుక్క నీటిని కూడా వదులుకోమని ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పించలేకపోయిందని నిలదీశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

అసెంబ్లీ పనిదినాలు పెంచాలి..

ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీని నడుపుతామని ప్రభుత్వం చెప్పిందని.. అందులో రెండు ఆదివారాలు, రెండు పండుగలు పోతే అసెంబ్లీని ఎన్ని రోజులు నడుపుతారని అడిగామని.. కచ్చితంగా అసెంబ్లీ పని దినాలు పెంచాలని చెప్పామని హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆదివారాలు సైతం అసెంబ్లీ పెట్టాలని కోరామన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు సభ పెట్టాలని కోరామని.. సీఎంతో మాట్లాడి చెప్తామని అన్నారని తెలిపారు. 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారని.. 22న ఆదివారం అసెంబ్లీ ఉంటుందని తెలిపారు. హౌస్ కమిటీలు వేస్తామని చెప్పారని తెలిపారు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేదని.. అన్ స్టార్డ్ క్వశ్చన్స్, జీరో అవర్ ప్రశ్నలకు సమాధానం ఇప్పటి వరకు రాలేదని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రయివేటు మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరామని.. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇద్దరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. తాము మాట్లాడుతుంటే సీఎం, సంబంధిత శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల మంత్రి మాత్రమే మాట్లాడాలని చెప్పినట్లు వెల్లడించారు. సీఎంపై బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఇస్తే పట్టించుకోవడం లేదని స్పీకర్‌కు చెప్పామని.. 19 అంశాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ తరపున అడిగామని అన్నారు. బీఏసీ మినిట్స్ ఫాలో కాకపోతే వచ్చే బీఏసీని బాయ్ కాట్ చేస్తామన్నారు. అసెంబ్లీని 9 గంటలకు పెట్టాలని బీఏసీలో డిమాండ్ చేసినట్లు తెలిపారు. అసలు ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను పెట్టలేదని.. ప్రివిలేజ్ మోషన్స్ తీసుకునేది డిప్యూటీ స్పీకర్ అని.. ఈ స్పీకర్ భాద్యత తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

Next Story