- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ పాలనలో ఆ నలుగురు ఫుల్ హ్యాపీ: హరీష్ రావు
సీఎం రేవంత్‌రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌కు హాజరై మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌కు హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ఉపయోగించి రియల్ ఎస్టేట్, వ్యాపారవేత్తలను బ్లాక్ మెయిల్ చేశారని.. చివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. చేసింది చెప్పుకునేది లేక జూబ్లీహిల్స్ నాయకులు, ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. పథకాలు ఆగిపోతాయి అని ప్రజలను బెదిరిస్తున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదని కాలేజీలు అడిగితే.. వాటి మీద విజిలెన్స్, పోలీసుల దాడులు నిర్వహిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తే.. రెండేళ్లలో రేవంత్ రెండు రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు. ఆరోగ్యశ్రీ వైఎస్ తెచ్చిన పథకం అని గొప్పలు చెబుతూ బకాయిలు విడుదల చేయకుండా ఆసుపత్రులను బెదిరిస్తున్నారని అన్నారు. బకాయిలు అడిగితే ఆస్పత్రులపై అధికారులు, విజిలెన్స్, పోలీసు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకున్నదని.. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదని సూచించారు. ఓటమి భయంతో ఫ్రస్టేషన్ పోతున్నారని.. బ్లాక్ మెయిలర్ రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్
జూబ్లీహిల్స్ ఎన్నిక నాలుగు లక్షల మంది ప్రజల భవిష్యత్తు కాదని.. ఇది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అని హరీశ్‌రావు అన్నారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని.. కేవలం నలుగురు రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలు వికాసం, విధ్వంసానికి జరుగుతున్నాయని.. ప్రజలు వికాసం కావాలో, వికాసం కావాలో ఆలోచించాలని సూచించారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారని.. 6 వేల డబుల్ ఇళ్లు కడతామని చెప్పారని.. ఎక్కడ కట్టారో చూపించాలని సవాల్ విసిరారు. రెండేళ్లలో ఎందుకు మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదని.. ఎందుకు డబుల్ బెడ్ రూమ్‌లు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే ఎన్టీఆర్, పీజేఆర్ గుర్తు వచ్చారా అని నిలదీశారు. కొల్లూరు డబుల్ బెడ్ రూమ్‌ల వద్దకు ఏనాడైనా వెళ్లారా అని.. ఇప్పుడు మంత్రులు అందరూ లైన్ కడుతున్నారని ఆరోపించారు. అందుకే.. ప్రశ్నించే గొంతును గెలిపించాలని.. మూసీ, హైడ్రా పేరిట ఇళ్లు కూల్చితే నిలబడ్డది బీఆర్ఎస్ అని చెప్పారు.
కేసీఆర్ అగ్రికల్చర్ పెంచితే.. రేవంత్ గన్‌కల్చర్ తెచ్చారు
బీఆర్ఎస్ హయాంలో శాంతిభద్రతల కోసం పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. ఇప్పుడు వాటి నిర్వహణ కూడా లేదని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో శాంతిభద్రతల నిర్వహణ లేకుండా పోయిందని.. నడి రోడ్డుపై మర్డర్లు జరుగుతున్నాయని ఆరోపించారు. జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై మిట్ట మధ్యాహ్నం దారుణంగా కత్తితో దాడి చేస్తే ఒక యువకుడు చనిపోయాడన్నారు. పోలీసులకు జీతాలు, బెన్ఫిట్స్ ఇవ్వకుండా వారికి నరకం చూపిస్తున్నారని, రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమనం, ఒక్క క్రైంలో మాత్రమే పురోగమనం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అగ్రికల్చర్ పెంచితే, రేవంత్ గన్ కల్చర్ పెంచారని ఆరోపించారు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నమోదైన క్రైం రేటు చూస్తే రేవంత్ ఘనత ఏపాటిదో అర్థమైతదని అన్నారు. మహిళల పట్ల జరుగుతున్న నేరాల శాతం 12.3 శాతం పెరిగిందని.. ఏడాదితో పోల్చితే అత్యాచారాలు 28శాతం, కిడ్నాపులు 26శాతం పెరిగాయన్నారు.
తరలిపోతున్న పెట్టుబడులు
రేవంత్ రాక్షస పాలన చూసి పెట్టుబడులు తరలిపోతున్నాయని.. రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిందని హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు కడితే రేవంత్ పేదల ఇండ్లు కూల్చారని అన్నారు. కేసీఆర్ కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా ఉన్న హైదరాబాద్.. ఇప్పుడు ఇన్‌సెక్యూరిటీ హబ్‌గా మారిపోయిందని ఆరోపించారు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చొని సీఎం క్రైం మీద మాత్రం రివ్యూ చేయడం లేదని.. కేవలం కమీషన్ల మీద రివ్యూ చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మున్సిపల్ మంత్రిగా ఫెయిల్.. విద్యా మంత్రిగా ఫెయిల్.. హోం మంత్రిగా ఫెయిల్.. టోటల్‌గా సీఎంగా అట్టర్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. మంత్రులకు నమ్మకం లేక రేవంత్‌రెడ్డిపై, ప్రభుత్వంపై ఒక ఎమ్మెల్యే ప్రపంచ బ్యాంకుకు నిధుల కోసం లేఖ రాశారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ నిధులు ఇవ్వదు.. కాంగ్రెస్ కొట్లాడదని అన్నారు. ఈ రెండు పార్టీలూ ఒకటేనని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడు వెంకట్ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే యాక్షన్ లేదని ఆరోపించారు. ఓటు చోరీ అనే రాహుల్‌గాంధీ ఎందుకు ఇక్కడ ఓటు చోరీ గురించి మాట్లాడరని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి మోసం చేశాయని అన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల ముస్లింలపై వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చింది.. ముస్లిం ఎప్పుడు వచ్చింది అని ప్రశ్నించారు. పథకాలకు డబ్బులు లేవంటూనే.. ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. కేవలం కమీషన్ల కోసమే వాటికి నిధులు ఇస్తున్నారని అన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ అడిగిన ప్రశ్నకు బీఆర్ఎస్ రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు. కానీ రెండేళ్లలో రూ.రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల అప్పు చేసి ఏం చేశారని ప్రశ్నించారు. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప, చేసింది ఏముంది రేవంత్ అని నిలదీశారు. మంత్రి కొండా సురేఖ కూతురు సీఎం మీద చేసిన ఆరోపణలకు రేవంత్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీజేఆర్ మరణానికి సైతం కాంగ్రెస్ పార్టీనే కారణమని.. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే బాధతో చనిపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో రెండే రెండు టీంలు ఉన్నాయని.. ఒకటి ఆరు గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీమ్.. మరొకటి ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పోరాడుతున్న టీం అని వెల్లడించారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.






