- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అది హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం.. రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై హరీశ్ రావు సెటైర్లు
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు. తెలంగాణపై తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్ రావు.. బీజేపీ-కాంగ్రెస్ బంధంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాజకీయ విలువలున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరుతుందని మాజీ మంత్రి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) అన్నారు. జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఈ నెల 20వ తేదీన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍తో పాటు జగిత్యాలలో హరీశ్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసిందని 'రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి' అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అనడానికి జీవన్ రెడ్డి గారి చేరిక ఒక సజీవ సాక్ష్యం అన్నారు.
తేజస్వి సూర్య మాటలకు గుండెలు రగిలిపోతున్నాయి:
నిన్న పార్లమెంటులో జరిగిన రెండు పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయని హరీశ్ రావు అన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమేనన్నారు. ఆయన తన వ్యాఖ్యల పట్ల బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గం అని మండిపడ్డారు. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయని కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా? అని నిలదీశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులు పాసై, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు.
మేమే ఉంటే మూతి పగిలే సమాధానం చెప్పేవాళ్లం:
కనీస అవగాహన లేకుండా తెలంగాణపై, ఉద్యమంపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని ఒక ఎంపీ తప్పు మాట్లాడితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించడం దారుణం అన్నారు. బీజేపీ తక్షణమే తేజస్వి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుందన్నారు. నిన్నటి లోక్‌సభ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని మన ఎంపీలు సభలో ఉండి ఉంటే తేజస్వికి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన, మూతి పగిలే సమాధానం చెప్పేవాళ్లం అన్నారు.మన రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా పెదవులు మూసుకొని మౌనంగా కూర్చున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా? అని నిలదీశారు.
కార్యకర్తలకు కొట్లాటలు.. మీకు విందులా?
అదే రాజ్యసభలో ఉన్న ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్రాజెక్టులపై అవాకులు చవాకులు పేలిన కేంద్ర జల వనరుల మంత్రికి దీటైన సమాధానం ఇచ్చారని స్పీకర్‌ను కలిసి ఆధారాలు చూపించి రికార్డులను సైతం సవరించారన్నారు. రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న బడే భాయ్ ఛోటే భాయ్ బంధం మరోసారి బట్టబయలైందని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపునిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి భోజనానికి వెళ్లారని విమర్శించారు. కార్యకర్తలేమో కొట్లాడుకోవాలి.. మీరేమో విందులు చేసుకోవాలా? అని నిలదీసారు.
హైబ్రిడ్ విధానం ఏంటో ఇవాళ స్పష్టమైంది:
డీలిమిటేషన్‍పై రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానం ఏంటో ఇవాళ స్పష్టమైందని అది హైబ్రిడ్ కాదు క్రాస్ బ్రీడ్ అని సెటైర్ వేశారు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదో అని ఎద్దేవా చేశారు. బడే భాయ్‍కి భయపడే తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కనీసం స్పందించలేదన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంటులో కొట్లాడినట్లు నాటకాలు ఆడుతూ మహిళలకు తీరని ద్రోహం చేశాయని మహిళా బిల్లుకు నిజంగా చట్టబద్ధత కల్పించాలనుకుంటే దాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో ఎందుకు ముడిపెట్టారని ప్రశ్నించారు. బీజేపీకి పార్లమెంటులో 2/3 మెజార్టీ లేదని, 68 సీట్లు తక్కువ ఉన్నాయని ఆ పార్టీకి స్పష్టంగా తెలుసు. కేవలం రాజకీయాల కోసమే, ఎటువంటి చిత్తశుద్ధి లేకుండానే మహిళా బిల్లును తీసుకొచ్చారన్నారు. మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏనాడో నిరూపితమైందని కేసీఆర్ నాయకత్వంలో మొదటి తెలంగాణ శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఘనత మా పార్టీదేనన్నారు.
వాళ్లకు పట్టిన పరిస్థితే చంద్రబాబుకు.. రేవంత్‍రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్






