తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారంటే ఎవరైనా నమ్ముతారా?

by Gantepaka Srikanth |

రాష్ట్ర ప్రజలను, సభను తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారంటే ఎవరైనా నమ్ముతారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘రేవంత్‌రెడ్డి మాకు చెవిలో చెప్పలేదు.. మేం ఆపలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకెళ్లి స్టే తెచ్చిందని ఏపీ ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఇచ్చింది. రేవంత్ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ప్రకటన ఇచ్చింది. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్ రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలను, సభను తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి’ అని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ అంశంపై తెలంగాణ భవన్‌లో ఆదివారం హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని.. అసెంబ్లీలో ఉత్తమ్‌ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పారని మండిపడ్డారు. ‘నీ నాలుక కోయాలా.. ఎవరి నాలుక కోయాలో చెప్పు రేవంత్‌. చీము, నెత్తురు ఉన్నోడైతే రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేయాలి. అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ నాలు కోయాలి’ అని డిమాండ్ చేశారు. తాను ఇలా మాట్లాడుతున్నందుకు తనపై దాడి చేపించొచ్చు అని.. అవసరమైతే హత్యాయత్నం కూడా రేవంత్‌ చేయించవచ్చని ఆరోపించారు.

పాలమూరుకు కాంగ్రెస్ మరణశాసనం

ఫజల్ అలీ కమిషన్ వద్దన్నా.. ఆంధ్రాలో కలిపి తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని హరీశ్‌రావు అన్నారు. పాలమూరుకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన సమయంలోనూ అన్యాయం చేశారని.. 11వ షెడ్యూల్‌లో పాలమూరు-రంగారెడ్డి పెట్టలేదని అన్నారు. తెలంగాణకు నెంబర్‌ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. మొదటి నుంచి కేసీఆర్ చెబుతున్న మాటలు నేడు అక్షర సత్యం అయ్యాయని.. రేవంత్‌ రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పచెబుదామంటూ లేఖ రాశారని ఆరోపించారు. నిపుణుల సహకారంతో పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరానికి కేసీఆర్ రూపకల్పన చేశారని.. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరాన్ని పండబెట్టారని అన్నారు. రూ.100-200 కోట్లు ఖర్చు పెడితే 5 నుంచి 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉండేదన్నారు. రెండేళ్లలో రూ.2 కూడా కాళేశ్వరంపై ఖర్చు పెట్టలేదని.. రైతాంగం, ఉత్తర తెలంగాణపై పగబట్టారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్‌ లేకపోయిన నదీప్రవాహం నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను నడిపి నీళ్లు తెచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. రాష్ట్రానికి మేలు చేయడానికే పాలమూరు ప్రాజెక్టు కట్టామని చెప్పారు. రెండేళ్లుగా ప్యాకేజ్‌-3లో బుడ్డ కాల్వ పూర్తి చేస్తే ఈ ఏడాది 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశాన్ని కాలరాశారని ఆరోపించారు.

బనకచర్లపై లోపాయికారి ఒప్పందం

పాలమూరుపై రేవంత్‌ పగబట్టారని.. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్, టీడీపీ ద్రోహం చేస్తే రేవంత్ ఆ ద్రోహాల పరంపర కొనసాగిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి పచ్చిఅబద్ధాలు మాట్లాడారని.. యావత్ శాసనసభను తప్పుదోవ పట్టించారన్నారు. మరోవైపు.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని.. తెలంగాణ ప్రాజెక్టులను కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై కక్షగట్టారని.. పాలమూరుపై పగబట్టారని అన్నారు. ఉమ్మడి ఏపీలో 42 లక్షల ఆయకట్టు ఉన్నదని.. పదేళ్లలో 5.71 లక్షలు ఆయకట్టు కాంగ్రెస్‌ తెస్తే.. పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో కొత్తగా 17.24 లక్షల ఆయకట్టు తెచ్చామని హరీశ్‌రావు వెల్లడించారు. అలాగే.. ఎస్సారెస్పీ స్టేజ్‌-2కు కాళేశ్వరం నీళ్లు అందించామని తెలిపారు.

299 టీఎంసీలకు శాశ్వతంగా ఒప్పుకోలేదు..

కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీల్లో 299 నికరజలాలు అని.. తాము వాటికి పర్మినెంటుగా ఒప్పుకొని వచ్చామని చెప్పడం పూర్తి అబద్ధమని హరీశ్‌రావు అన్నారు. ఫస్ట్‌ అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌లోనే కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటుపై ప్రశ్నించామని.. పాలమూరు, డిండిని తాము కొనసాగిస్తామని కేసీఆర్‌ చెప్పారని అన్నారు. 299 ఒప్పందానికి ఒప్పుకున్నారని సీఎం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ ద్రోహం వల్లనే కృష్ణాలో 299 టీఎంసీలు వచ్చాయని.. కానీ గోదావరిలో 933 టీఎంసీలకు మనం అనుమతులు సాధించామని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69 శాతం నీళ్లు రావాలని కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. సెక్షన్‌ 3 కోసం 32 లేఖలు కేంద్రానికి రాశారని తెలిపారు. కేంద్రం మెడలు వంచి సెక్షన్‌ 3 సాధిస్తేనే ఇవాళ నీళ్ల పంపిణీపై ట్రిబ్యూనల్ దగ్గర వాదనలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. నీళ్ల విషయంలో చంద్రబాబు, జగన్‌ను కేసీఆర్‌ నిలదీశారని.. పోతిరెడ్డిపాడు ఆపకపోతే ఆలంపూర్‌ దగ్గర ప్రాజెక్టు కడతామని హెచ్చరించారని తెలిపారు.

7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించాం..

బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక 11 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పంపామని.. ఏడు ప్రాజెక్టులకు అనుమతులు సాధించామని హరీశ్‌రావు చెప్పారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టు ఒకటి పెండింగ్‌లో ఉన్నదని.. కాంగ్రెస్ వచ్చాక పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ వాపస్ వచ్చిందని అన్నారు. అంబేద్కర్ వార్దా డీపీఆర్‌ వాపస్ వచ్చిందని.. కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ వాపస్ వచ్చిందని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క డీపీఆర్ పంపలేదు.. ఒక్క క్లియరెన్స్ తేలేదు.. 3 డీపీఆర్‌లు మాత్రం వాపస్ వచ్చాయని అన్నారు. బీఆర్‌ఎస్ సక్సెట్ రేటు 63 శాతం అయితే.. కాంగ్రెస్ సక్సెట్ రేట్ -30 శాతం అన్నారు. పాలమూరు బిడ్డ అంటూ సొంత ప్రాంతానికే రేవంత్‌ ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే.. టెలీమెట్రీలను పెట్టాలని 2016లోనే కేసీఆర్ చెప్పారని.. అన్నీ దాచి సగం పేరాగ్రాఫ్‌లు మాత్రమే రేవంత్‌ చదివి వినిపించారని తెలిపారు. మోకాలు, బోడిగుండుకు ముడిపెట్టేలా రేవంత్‌ మాటలున్నాయన్నారు. కృష్ణాలో పెండింగ్‌ ప్రాజెక్టులు తాము రన్నింగ్‌ ప్రాజెక్టులుగా చేశామని.. 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత తమదని అన్నారు. కల్వకుర్తిలోనే 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని తెలిపారు. కృష్ణాలో 50:50 ఇవ్వాలని 28 లేఖలు రాశామన్నారు. తాము మరణశాసనం రాశామని కాంగ్రెస్‌ అబద్ధాలు చెబుతున్నదని.. 2023లోనే 66.34 లేకుండానే అగ్రిమెంట్‌ చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ వచ్చాక మళ్లీ 66.34కు ఒప్పుకున్నదన్నారు. సెక్షన్‌ 3 కింద కృష్ణా జలాల పునః పంపిణీ జరగనుందని.. ఐదారు నెలల్లో 500-600 టీఎంసీలు రాబోతున్నాయని వెల్లడించారు. తెలంగాణ నీళ్లకు కేసీఆర్ అన్యాయం చేశారంటే ఎవరైనా నమ్ముతారా అని అన్నారు.

అతి తక్కువ నీటి వినియోగం కాంగ్రెస్ హయాంలోనే..

2024-25లో కృష్ణానదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వమని.. కేవలం 28.49 శాతం వినియోగించారని హరీశ్‌రావు అన్నారు. ఇంత తక్కువ స్థాయిలో నీటిని వినియోగించుకోవడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన మరో ద్రోహం అని అన్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో శ్రీశైలం ద్వారా ఏపీకి 730 టీఎంసీలు పోతే.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో 120 టీఎంసీలు మాత్రమే వెళ్లాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో 241 టీఎంసీల నీళ్లు తరలివెళ్లాయని.. కాంగ్రెస్ చేతగాని తనానికి ఇది మరో నిదర్శనమని విమర్శించారు. రెండేళ్లలో 11.60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారని.. లక్ష ఎకరాలకు కూడా కాంగ్రెస్ నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. చెక్‌డ్యామ్‌లు పేల్చుడు, ప్రాజెక్టులు కూలగొట్టుడు.. ప్రాజెక్టులు మునగ గొట్టుడు, ప్రాజెక్టులు తెగ్గొట్టుడు ఇదే రేవంత్ నైజం అని అన్నారు. మరోవైపు.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉద్దెర మాటలు మాట్లాడుతున్నారని, ఏడేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో ఎస్ఎల్‌బీసీలో 11.5 కి.మీ. టన్నెల్ తవ్వామని చెప్పారు. దానికి రూ.1,358 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. టన్నెల్ పూర్తయితే డిండి, పెండ్లిపాక రిజర్వాయర్‌లో నీళ్లు వస్తాయని డిండి, పెండ్లిపాక రిజర్వాయర్ల మీద రూ.3,892 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. కాంగ్రెస్ రెండేళ్లలో 18 మీటర్లు తవ్విందని అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పెద్దవాగు కొట్టుకుపోయిందని.. వట్టెం పంప్‌హౌస్‌ మునిగిపోయిందని.. ఎస్ఎల్‌బీసీ కుప్పకూలిందన్నారు. కనీసం శవాలను కూడా బయటకు తీయలేదని పేర్కొన్నారు.

మరో జలపోరాటానికి శ్రీకారం..

నేరం చేసేది కాంగ్రెస్ అయితే.. నెపం బీఆర్‌ఎస్‌ మీద నెడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ అన్యాయంపై ప్రశ్నిస్తామని.. ప్రజాక్షేత్రంలో ఎంగడుతామని.. ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్‌ఎస్ శ్రీకారం చుడుతుందని స్పష్టం చేశారు. తమకు అధికారం ముఖ్యం కాదని.. ప్రజల హక్కులు ముఖ్యమని వెల్లడించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం బీఆర్‌ఎస్ పోరాడుతుందని చెప్పారు.

Next Story