- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: మంద బలం ఉందని మాట్లాడటం కరెక్ట్ కాదు
సీఎం రేవంత్‌రెడ్డి గురుదక్షిణ చల్లించుకునే పనిలో పడ్డారని.. రేవంత్ గురుదక్షిణలో భాగంగా చంద్రబాబు, ఢిల్లీ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారని.. రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టవని.. ఆ ధైర్యం చూసుకొని ఏపీ మంత్రి లోకేశ్ బనకచర్ల కట్టి తీరుతామని మాట్లాడుతున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి గురుదక్షిణ చల్లించుకునే పనిలో పడ్డారని.. రేవంత్ గురుదక్షిణలో భాగంగా చంద్రబాబు, ఢిల్లీ మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారని.. రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టవని.. ఆ ధైర్యం చూసుకొని ఏపీ మంత్రి లోకేశ్ బనకచర్ల కట్టి తీరుతామని మాట్లాడుతున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. రేవంత్‌రెడ్డి పెదవులు మూసుకోవడం వల్లే చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందన్నారు. లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సహకరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో పవర్ ఉందని లోకేశ్ ప్రాజెక్టు కట్టి తీరుతం అంటున్నారని చెప్పారు. అయినా.. సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. లోపాయికార ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. చీఫ్ సెక్రెటరీ ఏమో బనకచర్ల అంశంపై చర్చకు రాము అని లేఖ రాస్తారని.. రేవంత్ మాత్రం పాల్గొని, కమిటీ వేసేందుకు ఒప్పుకొని వస్తారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్, బీజేపీ డూడూ బసవన్నలా తలూపుతున్నారని అన్నారు.
డీపీఆర్ ఎందుకు వెనక్కి వచ్చింది?
లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడారని.. అధికారం, మంద బలం ఉందని మాట్లాడటం పొరపాటు అని హరీశ్‌రావు అన్నారు. మిగులు జలాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు డీపీఆర్‌ను వెనక్కి తిప్పి పంపిందని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ, ఎన్విరాన్‌మెంట్ సంస్థలు ఎందుకు బనకచర్ల డీపీఆర్‌ను తిరస్కరించాయని అన్నారు. నాలుగు కేంద్ర సంస్థలు బనకచర్లను తిప్పి పంపింది నిజం కాదా అని నిలదీశారు. మిగులు జలాలు ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎత్తిపోతలకు పొక్క కొట్టుడో, చిల్లు కొట్టుడో ఉండదన్నారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండటం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. పోతిరెడ్డికి పొక్క పెట్టి నీళ్లు తీసుకుపోయారని ఆరోపించారు.
నీళ్లు తరలిస్తామంటే ఊరుకోం..
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు నీళ్లు తీసుకుపోతా అంటే చూస్తూ ఊరుకుంటామా అని హరీశ్‌రావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పదవులను గడ్డి పోచలుగా వదులుకున్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్నిరకాల అనుమతులు ఉన్నాయని.. ఆ వివరాలు పంపిస్తాం చూసుకోండని సూచించారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదని చెబుతున్న లోకేశ్ చెప్పడం అవగాహనారాహిత్యమన్నారు. కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఏడు ఉత్తరాలు రాశారని.. తాము వ్యతిరేకించలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు. అనుమతులు నిలిపివేయాలని, ప్రాజెక్టులు ఆపాలని లేఖలు రాశారని ఆరోపించారు. కాళేశ్వరానికి అవసరమైన 11 రకాల అనుమతులు తీసుకున్నామని స్పష్టం చేశారు. కాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా, నీళ్లు ఏపీకి పోవాలనే కుట్ర చేస్తున్నట్లుందని ఆరోపించారు. ఏపీలో అక్రమ ప్రాజెక్టులు కట్టి కృష్ణా నదిలో నీళ్లు మళ్లించినట్లు, గోదావరి నీళ్లు మళ్లించాలనేది కుట్ర చేస్తున్నారని అన్నారు. రెండు నదులను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టులు కడుతామని ఏపీ అంటే.. తాము అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. తమ వాటా తమకు ఇస్తే గౌరవిస్తామని.. బుల్డోజ్ చేస్తామంటే సహించేది లేదన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లయినా సరే కేసీఆర్, బీఆర్ఎస్ తెలంగాణ హక్కులను కాపాడుతుందని స్పష్టం చేశారు. ‘అనుమతులు తెచ్చుకునే పద్ధతి మీకు తెలిస్తే.. ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు’ అని అన్నారు.
968 టీఎంసీలకు ఒప్పుకోండి..
‘968 టీఎంసీలను అంగీకరించండి. దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన లేఖలను విత్ డ్రా చేసుకోండి. గోదావరిపై నిర్మించే మా ప్రాజెక్టులను వ్యతిరేకించారు. వాటిని విత్ డ్రా చేసుకోండి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గోదావరి నీళ్లు కృష్ణాకు మళ్లిస్తే ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన 155 టీఎంసీలు తమకు ఇస్తామని ఒప్పుకోవాలన్నారు. 1,480 టీఎంసీల కంటే ఎక్కువ ఉన్న నీటిని 65:35 ప్రకారం వాటా లెక్క తేల్చాలని అన్నారు. ప్రాంతీయ విద్వేశాలు రెచ్చగొడుతున్నారని అంటున్నారని.. గోదావరి నదిలో తమ వాటా కావాలె అంటున్నామని, మిగులు జలాల లెక్క తేలాలి అంటున్నామని అన్నారు. విశాఖ ఉక్కుకు కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని చెప్పారు.






