Harish Rao: నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక ప్రపంచ ఆటగాడివా?.. సీఎం వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్

by Prasad Jukanti |

రెండేళ్లుగా కేసీఆర్ గారి మీద, బిఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడ్వడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేముందని హరీశ్ రావు ప్రశ్నించారు.

Harish Rao: నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక ప్రపంచ ఆటగాడివా?.. సీఎం వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండేళ్లుగా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడ్వడం తప్ప నువ్వు చేసిందేముంది అని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోనట్లు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం మార్చుకోడు, మార్చు కోలేడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్‍బీసీ పనులు ఆగిపోతే మామ అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారని, కేసీఆర్, హరీశ్ రావు వెళ్లి నాగార్జునసాగర్, శ్రీశైలంలో దూకినా మీ శవాలను వెతికిస్తాం తప్ప ఎస్ఎల్‍బీసీని ఎట్టిపరిస్థితుల్లో ఆపేది లేదని అన్నారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు. విజయోత్సవాలు అంటూ విచ్చలవిడిగా తిరుగుతూ, వికృతంగా మాట్లాడటం వల్ల చేయనివి చేసినట్లు అయిపోవని దుయ్యబట్టారు.

అబద్దాలు ప్రచారం చేసినంత మాత్రాన, వాస్తవాలు మరుగున పడిపోవుని కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలు మరిచిపోరన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని పచ్చి అబద్దం చెబుతున్న రేవంత్ రెడ్డి.. 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసింది అబద్దమా? అని ప్రశ్నించారు. గతంలో కార్డు మీద నాలుగు కేజీల బియ్యం మాత్రమే ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఆరు కేజీలకు పెంచి, కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చింది అబద్దమా? అని నిలదీశారు. నల్లగొండ ప్రజల మీద కక్ష కట్టింది ఎవరు? ఎస్‍ఎల్‍బీ‍సీ ప్రాజెక్టును నెవర్ ఎండింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేసింది ఎవరు? ప్రాజెక్టును పడావు పెట్టింది ఎవరు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.3892 కోట్లు ఖర్చు చేసి, 11.48 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేసింది నిజం కాదా? అన్నారు. ఈ లెక్కలు మీ ప్రభుత్వం దగ్గర లేవా? పదే పదే ఎందుకు అబద్దాలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి? అని మండిపడ్డారు.

మీ అనాలోచి నిర్ణయాల వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల, మీ దుందుడుకు చర్యల వల్ల ఇవాళ ఎస్‍ఎల్‍బీ‍సీని త్రిశంకు స్వర్గంలో పడేసింది మీరు కాదా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ఎలాంటి స్టడీ నిర్వహించకుండా 8 మంది అమాయకుల ప్రాణాలను బలి కొన్నది మీరు కాదా? అని నిలదీశారు. రెండేళ్లలో కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వని నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్ కలుగుతుందన్నారు. అక్రమంగా కృష్ణా నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే, అక్రమ ప్రాజెక్టులకు డీపీఆర్ లు తయారు చేస్తుంటే అడ్డుకోలేని రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తున్నారని దుయ్యబట్టారు. కనీసం ఎస్‍ఎల్‍బీ‍సీ సొరంగంలో చిక్కుకున్న శవాలను కూడా ఇప్పటికీ బయటకు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం మీదని విమర్శించారు.

రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మీరు మాత్రం పాలన గాలికి వదిలి ఫుట్ బాల్ ఆడుతున్నారని ఆటలాడటంపై ఉన్న శ్రద్ద మీకు ప్రజా సమస్యల మీద, పరిపాలన మీద లేక పోవడం సిగ్గుచేటు అన్నారు. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక ప్రపంచ ఆటగాడివా? రేవంత్ రెడ్డి భ్రమల నుంచి బయటికి వచ్చి చూడాలని, మీ మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారన్నారు. మీ చేతగాని పాలనను అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని నీ స్కాంల పాలనను ప్రతి ఒక్కరూ ఛీ కొడుతున్నారని విమర్శించారు. అందిన కాడికి దోచుకోవడం, అందరు కలిసి పంచుకోవడం ఇదే కదా మీరు చేసింది. మూటలు, వాటాలు, కమీషన్లు ఇదే కదా మీకున్న విజన్ అంటూ విమర్శలు గుప్పించారు. నలుదిక్కులా గద్దల్లా మారి భూములను ఖతం పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి అందిన కాడికి దండుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతగాని సర్కారు మీది అంటూ దుయ్యబట్టారు.

కూట్లో రాయి తీయని రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రపంచ స్థాయి అంటుండటం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటూ.. ఎవరిని మభ్య పెడుతున్నవు? ఇందులో ఎన్ని కోట్ల స్కాంకు ప్లాన్ వేసినవు. ఇందులో ఎవరి వాటా ఎంత? అని నిలదీశారు. గాల్లో మేడలు కట్టడం, అబద్దాలు చెప్పి రంగుల ప్రపంచం చూపడం మానేసి.. పాలన మీద దృష్టి సారించాలన్నారు. చిల్లర మాటలు, వెకిలి చేష్టలతో రాష్ట్రం అభివృద్ది చెందదు, ప్రజల సమస్యలకు పరిష్కారం లభించదని విస్తరి ఆకులా ఎగిరెగిరి పడుతున్న రేవంత్ రెడ్డి.. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి అన్న విషయం గుర్తుంచుకో.. అహంకారం తగ్గించుకొని అజ్ఞానాంధకారం తొలగించుకో అని హితవు పలికారు.

Next Story