నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి.. ఇదే రేవంత్ పాలన: హరీశ్ రావు హాట్ కామెంట్స్

by Ramesh Naini |

ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అన్నీ ఎగబెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.

నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి.. ఇదే రేవంత్ పాలన: హరీశ్ రావు హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అన్నీ ఎగబెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కాంగ్రెస్ (Congress) పార్టీపై మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, పరిపాలన కుంటుపడిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు వచ్చాయని రైతుబంధు వేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలకు జీతాలు బంద్ పెట్టి మరి రైతుబంధు ఇచ్చామని గుర్తుకు చేశారు. నాట్లు.. నాట్లకు మధ్య కేసీఆర్ ఇస్తే.. ఓట్లు ఓట్లకు మధ్య రేవంత్ ఇస్తున్నారని అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

అడ్డదారుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల్లో కోత విధించారని, మరీ నీకు కూడా ఏం కోత పెట్టాలో చెప్పాలని నిలదీశారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పి.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలో చెప్పాలని కోరారు. మెడిగడ్డ ప్రాజెక్టు 20 నెలలు అయిన రిపేర్ చేయట్లేదన్నారు. అందులో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని, కానీ వారి మెదడు మాత్రం కూలిందని విమర్శించారు. మేడిగడ్డ లేకపోయిన గోదావరిలో నీరు వస్తోందని, కన్నెపల్లి పంప్ హౌజ్‌లో మోటర్లు స్టార్ట్ చేస్తే.. నిజాంపేట్ మండలంలో చెరువులు నింపొచ్చని స్పష్టం చేశారు.

నేను మాట్లాడితే అబద్ధాలు అంటున్నారు.. తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదని చెప్పినా.. ఏది అబద్ధం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రశ్నించారు. శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైంది అబద్దమా? నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదనేది అబద్దమా? పోయిన ఏడాది తెలంగాణకు రావాల్సిన 65 టీఎంసీల నీళ్లను ఏపీ సీఎం చంద్రబాబుకు అప్పగించి.. ఇక్కడి పంటలను ఎండబెట్టింది అబద్దమా? అని ప్రశ్నించారు. పాలన చేతకాక మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వడం చేతగాక.. అబద్దమని మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారని అన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎక్కడ మాట్లాడాలో మాట్లాడుదామన్నారు. సీఎం రేవంత్ (CM Revanth Reddy) పాలన ఎలా ఉందంటే నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి అన్నట్లుగా ఉందని హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా కూడా ఢిల్లీకి సీఎం మూటలు అందించేందుకే వెళ్లారని విమర్శలు గుప్పించారు.

Next Story