రైతులను గందరగోళానికి గురిచేయడమే హరీశ్‌రావు లక్ష్యం : వేముల వీరేశం

by Ramesh Naini |

హరీశ్‌రావు మీడియా దృష్టిలో పడేందుకే సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు.

రైతులను గందరగోళానికి గురిచేయడమే హరీశ్‌రావు లక్ష్యం : వేముల వీరేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : హరీశ్‌రావు మీడియా దృష్టిలో పడేందుకే సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అబద్దాలు చెప్పి రైతులను గందరగోళ పరచడమే ఆయన ఉద్దేశం అని తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్‌రావు లాంటి నీచ రాజకీయాలు దేశంలో మరొకరు చేయరని మండిపడ్డారు. బుధవారం వేముల వీరేశం సీఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంపై హరీశ్​రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని, రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని, కొన్న మూడు రోజులకే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని ఆయన వివరించారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం రైతు బంధు ఇచ్చి అద్భుతం చేశామని చెప్పుకున్నారని, రైతుబంధు మొదలు పెట్టినా గతంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆగలేదని, కేసీఆర్ హయాంలో 6,676 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వలసల గురించే మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని వేముల వీరేశం నిలదీశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా దోషులు, నేరస్తులుగా బీఆర్ఎస్ నాయకులు మిగిలిపోయారని, గాడి తప్పిన వ్యవస్థను, అప్పులపాలైన రాష్ట్రాన్ని చక్కదిద్దే నాయకుడు రేవంత్ రెడ్డి అని ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులను చీరి చింతకు కట్టాలని వేముల వీరేశం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హరీశ్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు

హరీశ్‌రావు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే నని, బీఆర్ఎస్ హయాంలో ఎంత మంది బతుకుల్లో నిప్పులు పోశారో కవితనే చెప్పిందని వేముల వీరేశం ఆరోపించారు. సొంత అల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేశారని కవిత ఆరోపించిందని ఆయన తెలిపారు. హరీశ్​రావు తన ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టుకున్నారని, ఆ సీసీ కెమెరాలు హ్యాక్ అయితే బాధ్యత ఆయన తెచ్చిపెట్టుకున్న ఏజెన్సీదే అని వేముల వీరేశం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావే విచారణలో ఒప్పుకున్నారని, ట్యాపింగ్ తమ మెడకు చుట్టుకుంటుందనే హరీశ్‌రావు ఇప్పుడు ట్యాపింగ్ జరుగుతుందని డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడుకుంటుున్నారని ఆయన తెలిపారు.

Next Story