కాంగ్రెస్ అంటేనే కరప్షన్.. తుమ్మిడిహెట్టిపై అసత్య ప్రచారాలు : హరీష్ రావు ఫైర్

by Naga Rani Yarlagadda |

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ అంటేనే కరప్షన్.. తుమ్మిడిహెట్టిపై అసత్య ప్రచారాలు : హరీష్ రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్‌కు మరో పేరని ఆరోపించిన ఆయన.. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.

తుమ్మిడిహెట్టి వద్ద రూ.11 వేల కోట్ల పనులు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుండటం పూర్తిగా అవాస్తవమని హరీష్ రావు విమర్శించారు. మరోవైపు ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరిందని మంత్రులు చెబుతుండగా.. సీఎం మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పందం కుదిరేలా చూడాలని లేఖ రాశారని చెప్పడం ప్రభుత్వ వైఖరిలోని గందరగోళాన్ని బయటపెడుతోందన్నారు. 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదని పేర్కొన్నారు.

ప్రాజెక్టుపై ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతోందని, కాంగ్రెస్‌కు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని హరీష్ రావు ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని ఉపయోగించుకుంటోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్.. మహారాష్ట్రతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నా.. ఇప్పటి వరకూ ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేకపోయిందని ప్రశ్నించారు.

గతంలో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా రూ.2300 కోట్ల బిల్లులు ఎత్తేశారని, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద మంత్రులు హడావిడి చేయడం తప్ప అసలు పనిలో పురోగతి కనిపించడం లేదని, ‘పని తక్కువ.. ప్రచారం ఎక్కువ’ అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. 30 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని విమర్శించిన హరీష్ రావు.. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరో ప్రజలకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Next Story