వాట కుదరలేదా? మాట కుదరలేదా? కృష్ణాజలాలపై హరీశ్‌రావు విమర్శలు

by Prasad Jukanti |

కృష్ణా జలాల వినియోగంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు

వాట కుదరలేదా? మాట కుదరలేదా? కృష్ణాజలాలపై హరీశ్‌రావు విమర్శలు
X

దిశ,డైనమిక్ బ్యూరో: కృష్ణాజలాల్లో జనవరి 31 నాటికే ఏపీ ప్రభుత్వం తన (Krishna Water Dispute) వాటా జలాలు పూర్తయ్యాయని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వాడుకుంటున్న జలాలు మొత్తం తెలంగాణ వాటానే అని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) అన్నారు. టెంపరరీ అగ్రిమెంట్ ప్రకారం ఏపీ 66 శాతమే వాడాలి. కానీ 80శాతం వాడుకుందని ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి గడ్డి పీకుతున్నారా అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు.. ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలను నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన గురువు గారి భయంతో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం అడగరని, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలించుకుపోతుంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్ కూర్చోని సీఎం చూద్యం చూస్తున్నారని విమర్శించారు.

వాట కుదరలేదా? మాట కుదరలేదా?:

ఇండ్లెంట్లు లేవు, బోర్డు అనుమతులు లేవు ఏపీ ఇష్టా రాజ్యంగా కృష్ణా నీళ్లను తరలించుకుపోతోందన్నారు. ఈ విషయంలో తాను పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నాననన్నారు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీని ప్రకారం 664 టిఎంసీలు అంటే 80శాతం నీళ్లు ఏపీ వాడుకున్నది. 28 జనవరి నాడు తాత్కాలిక ఒప్పందం 66:34 ప్రకారం దాటి ఏపీ ఇప్పటికే 664 టీఎంసీలు వాడుకున్నదని ఇంకా రెండు రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుంది అని కేఆర్ఎంబీకి లేఖ రాసిందన్నారు. వెంటనే బోర్డు మీటింగ్ పెట్టి ఏపీ నీటి దోపిడిని ఆపాలని ఈఎన్సీ రాసిన లేఖలో ఉందన్నారు. 28 వ తేదీన ఈఎన్సీ లేఖ రాసి 31 న రిటైర్ అయ్యారన్నారు. ఆ తర్వా వారం రోజుల వరకు ఈఎన్సీ పోస్టును భర్తీ చేయలేదని, లెక్కకు మించిన నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడ ఈఎన్సీ పోస్టు ఎందుకు భర్తీ చేయలనేది ప్రశ్నించారు. వారం రోజుల తర్వాత మీడియా ప్రశ్నిస్తే పోస్టును భర్తీ చేశారన్నారు. ఈఎన్సీ బోర్డు మెంబర్ అని ఎందుకు ఆపోస్టును ఖాళీ పెట్టారు? వాట కుదరలేదా? మాట కుదరలేదా? అని నిలదీసారు.

పాలనమీద పట్టు, పట్టి లేదు:

వేసవిలో తెలంగాణ నీటి అవసరాలు పట్టించుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. తాత్కాలికంగానైనా మనం 34శాతం వినియోగించుకోవాల్సి ఉన్నా మనం కేవలం 20 శాతం వాటానే ఉపయోగించుకుంటున్నామన్నారు. ఈ రోజుకు కూడా ఏపీ 1.5టీఎంసీల నీళ్లు తీసుకుపోతుంటే మన పంటలు ఏం కావాలే? మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏం కావాలి? సర్కారు నడుపుతున్నరా? సర్కస్ నడుపుతున్నరా? అని మండిపడ్డారు. వరుసగా రెండు సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా జలాలను వినియోగించి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురు దక్షిణ చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది 20శాతం దాటలేదని ముఖ్యమంత్రి వైఫ్యల్యానికి ఇది నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రే ఈ రాష్ట్రం పాలిట శాపంగా తయారయ్యాడని హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి హక్కులను కాలరాస్తున్నాడని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టు, పట్టి లేదని విమర్శించారు.

ఆ విషయం బయటపడుతుందేమోనని మౌనం:

664 టీఎంసీలు ఏపీ తీసుకుపోయిందని ఈఎన్సీ కేఆర్ఎంబీకి లేఖ రాస్తే, కేఆర్ఎంబీ రాసిన లేఖలో 555 టీఎంసీలు తీసుకుపోయిందని ప్రస్తావించింది. వంద టీఎంసీలు తక్కువ చేసి కేఆర్ఎంబీ చెబుతున్నదని హరీశ్ రావు అన్నారు. అంటే అడగాల్సిన రేవంత్ రెడ్డి అడగడు, హక్కులు కాపాడాల్సిన కేఆర్ఎంబీ ఏపీని ప్రశ్నించదని కేఆర్ఎంబీ బిజేపీ ప్రభుత్వం చేతిలో ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేసీఆర్ మీద పడి ఏడ్వడం తప్పితే నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఆర్‍ఆర్‍టాక్స్ ఎక్కడ బయటకు వస్తదో, స్కాంలు ఎక్కడ బయట పడుతాయో అని రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటారని అన్నారు. బిజేపీ కూడా అట్లాగే మౌనంగా ఉందన్నారు. బిజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంతు, కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ గొంతు పిసుకుతారా? చంద్రబాబు, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉండొచ్చు. కానీ రాష్ట్ర హక్కులను ఆంధ్రాకు ఎందుకు రాసిస్తున్నారని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

కేఆర్ఎంపీ ముట్టడిస్తాం:

రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని త్వరలో కేఆర్ఎంబీ ఆఫీస్‍ను ముట్టడిస్తామన్నారు. కేంద్ర మంత్రిని కలిసి పార్లమెంట్‍లో గట్టిగా లేవనెత్తుతామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉండి తెలంగాణ హక్కులను కాపాడటంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని రాష్ట్ర నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. 19 ప్లేసుల్లో బిఆర్ఎస్ టెలిమెట్రీలు పెడితే మిగతా 9 ప్లేస్లుల్లో పెట్టడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందని విమర్శించారు.
Next Story