- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారు.. కేబినెట్‍పై హరీశ్ రావు మరోసారి ఘాటు వ్యాఖ్యలు
కేబినెట్ భేటీపై మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పాలన ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతల ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‍లో వడ్డెర సంఘం సమావేశానికి హాజరైన హరీష్ రావు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మొన్న కొండా సురేఖ కూతురు, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశామని, కేబినెట్ మీటింగ్‍లో ముఖ్యమంత్రి, మంత్రులు బట్టలూడ తీసుకొని తిట్టుకున్నారట అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడడం లేదని వాళ్ళు తన్నుకోడానికి, వాటాలు పంచుకోవడానికి సరిపోతోందని విమర్శించారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
ఓటుతో రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలి:
కాంగ్రెస్ ప్రభుత్వం మొరం కొట్టుకునే తమపై అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తోందని వడ్డెర సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో బిల్డింగ్‍లు నిర్మించే మీకు చేతినిండా పని దొరికేదన్నారు. కేసీఆర్ హైదరాబాద్‍లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తే, రేవంత్ రెడ్డి లక్ష ఇండ్లను కూలగొట్టారని విమర్శించారు. పేదల ఇండ్లు కూల్చొద్దన్న, హైడ్రా బంద్ కావాలన్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) కాంగ్రెస్‍ను ఓడించాలన్నారు. ఇక్కడ కాగ్రెస్ గెలిస్తే హైదరాబాదులో ఇండ్లు కూల్చినా ప్రజలు నాకే ఓట్లేశారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) విర్రవీగుతారని అందువల్ల కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలంటే ఈ ఉప ఎన్నికలో ఓటుతో రేవంత్ రెడ్డి బుద్ధి చెప్పాలన్నారు.
రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టర్:
రేవంత్ రెడ్డి డబ్బు మూటలను, గుండాలను నమ్ముకున్నారని ఆరోపించారు. గతంలో మీరు అడగకపోయినా హైదరాబాద్‍లో వడ్డెర సంఘానికి కేసీఆర్ ఎకరం భూమి ఇచ్చారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అంటే కటింగ్ మాస్టర్. రేవంత్ రెడ్డి ఎక్కడా కొత్త స్కీమ్ పెట్టింది లేదు కొత్త భవనం కట్టింది లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు, బిల్డింగ్‍లకు రిబ్బన్లు కట్ చేసుడు, కేసీఆర్ పెట్టిన స్కీములను కోతలు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కిట్, బతుకమ్మ చీర, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అన్ని పథకాలకు కత్తెర పెట్టారని విమర్శించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవులకు, కురుమలకు ఆత్మగౌరవ భవనాలను హైదరాబాద్‍లో నిర్మించామని, రేవంత్ రెడ్డి.. ఒక రూపాయి అయినా బీసీల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు ఇచ్చావా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రారంభించిన బీసీ ఆత్మగౌరవ భవనాలకు నిధులు విడుదల చేసి పనులను పూర్తి చేయాలన్నారు. భర్త చనిపోతే ఏడ్చిన ఆడపడుచుని కాంగ్రెస్ నాయకులు అవహేళన చేశారని హరీశ్ రావు మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయి చిన్నపిల్లలు ఉన్నారు. గోపీనాథ్ చనిపోతే ఆ కుటుంబాన్ని అనాధలుగా వదిలేయమంటారా? అని ప్రశ్నించారు.






