వడ్లు కొనే తెలివి లేదు బీఆర్ఎస్‌ను మొలకెత్తనివ్వవా?..రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు

by Prasad Jukanti |

వారి సొంత డిపార్ట్ మెంట్లో ఏం జరుగుతుందో తెలియని మంత్రులు నాకు చాలెంజ్ లు విసురుతున్నారని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వడ్లు కొనే తెలివి లేదు బీఆర్ఎస్‌ను మొలకెత్తనివ్వవా?..రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో రూ.2000 కోట్ల స్కామ్ కు పాల్పడిందని పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో ఎవరైనా స్కామ్ చేస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ నాకు ఛాలెంజ్ విసురుతూ మేము రూ.650 కోట్లకే కొంటే రూ.2000 కోట్ల స్కామ్ ఎక్కడి నుండి వచ్చిందని అంటున్నారని మీ డిపార్ట్మెంట్ లో మంత్రులుగా ఉండి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. యూనిఫాంలు, టైల కోసం రూ.1200 కోట్ల టెండర్ పిలిస్తే, ఉప్పులు, పప్పులు, చికెన్ కోసం రూ.800 కోట్ల టెండర్ పిలిచారు.. రెండు కలిపితే రూ.2000 కోట్లు. టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే మీరు ఏం పాలన చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. ఎంత కొన్నారో, ఎంత టెండర్లు పిలిచారు తెలియలేదు అంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాననని ముఖ్యమంత్రే మొత్తం టెండర్లు పిలిచి ఆ అనుముల అన్నా తమ్ముళ్లు మొత్తం మింగుతున్నారని అందుకే మంత్రులుగా ఉన్నా మీకు ఏమీ తెలియదన్నారు. గురుకులాల్లో రూ. 2000 కోట్ల కుంభకోణం వాస్తవం అని సొంత శాఖల టెండర్లపై మంత్రులకు కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం అల్గనూర్ గ్రామంలోని లక్ష్మీనరసింహ గార్డెన్‌లో నిర్వహించిన BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు.

దేవుని సాక్షిగా రుణమాఫీ ఎగవేత:

మూడు విడతల్లో రైతుబంధు ఎగ్గొట్టి అన్నదాతలకు బాకీ పడ్డ రూ.19,000 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. దేవుని సాక్షిగా రుణమాఫీ, పెన్షన్లు, స్కీములన్నీ ఎగ్గొట్టిన ముఖ్యమంత్రిని ఇకపై ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలవాలన్నారు. రైతు డిస్కమ్ పేరుతో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌కు ఉరితాడు బిగించే కుట్ర జరుగుతోందని ఫీజు రీయింబర్స్మెంట్ పైసా ఇవ్వకుండా 30 లక్షల మంది పేద విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపి, వారి జీవితాలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు పైసలు లేవంటున్న సీఎం.. వందల కోట్లతో క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటూ ఫుట్‍బాల్ షోకులు చేస్తున్నారని ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 16 వేలే ఇచ్చి, ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజులు డబుల్ చేసి నిరుద్యోగుల నడ్డి విరుస్తున్నారని రిజిస్ట్రేషన్లు, బస్సు టికెట్లు, ఆర్టీఏ ఛార్జీలు ఇష్టారీతిన పెంచేసి ప్రజల రక్తం తాగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ తో పెడుతున్న అక్రమ కేసులకు భయపడొద్దని ఓటర్ల సర్వేలో ఓట్లు గల్లంతు కాకుండా శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేవంత్ రెడ్డి తన మొహానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ బీఆర్ఎస్‌ను మొలకెత్తనియ్యనని ప్రగల్భాలు పలుకుతున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి పతారా ఖతమైపోయిందని మొన్న వర్షాలు పడి ట్రాఫిక్ జామ్ అయితే నేను చెప్పినా ఏ ఆఫీసర్ వింటలేడు అని ముఖ్యమంత్రే స్వయంగా అంటున్నాడు. నీ పని అయిపోయిందని, నువ్వు ఉండేది లేదని అధికారులకు అర్థమైంది కాబట్టే నీ మాట వినడం లేదన్నారు.

స్కీములు లేవు, అన్నీ స్కాములే:

రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు, అన్నీ స్కాములేనని సివిల్ సప్లై, సింగరేణి, కరెంటు, భూములు, చివరకి గురుకులాల్లో పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు, పప్పు, కోడిగుడ్లలో కూడా స్కామే అన్నారు. కేసీఆర్ పాలనలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు భీమా ఇచ్చామన్నారు. కోటిమంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నాడు కానీ ఎనుముల వారి నలుగురు అన్నదమ్ములు మాత్రమే కోటీశ్వరులు అయ్యారన్నారు. ఉపాధి హామీ కూలీలకు "ఇందిరమ్మ ఆత్మీయ భరోసా" కింద ఏడాదికి 12000 రూపాయలు ఇస్తామని మూడు బడ్జెట్లలో చదివారు. ఏ ఒక్క కూలీకి అయినా ఒక్క రూపాయి వచ్చిందా? బల్లలు కొట్టుడు తప్ప పేదవాడి కడుపు నిండింది లేదన్నారు. ఖజానా ఖాళీ అంటాడు కానీ ఫ్యూచర్ సిటీలో 100 కోట్లతో, ఎంసీహెచ్ఆర్డీలో మరో 100 కోట్లతో క్యాంప్ ఆఫీసులు కట్టుకోవడానికి, సచివాలయంలో వాస్తు మార్పులకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. రైతు బీమాకు ఎల్ఐసీకి పైసలు కట్టక అది కూడా నాలుగు నెలలుగా బంద్ అయిపోయిందని ఆరోపించారు.

పెంచుడు, దంచుడు, కమిషన్లు కొట్టుడు:

కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం కేవలం 5,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తా అంటున్నాడని నిరుద్యోగులు దిల్ సుఖ్ నగర్, చిక్కడపల్లిలో ధర్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ గారు ఒకేసారి 17,000 పోలీసు ఉద్యోగాలను నింపారని గుర్తు చేశారు. ఎలక్షన్ల ముందు ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు ఫ్రీ అన్నాడు, అధికారంలోకి రాగానే 400 ఉన్న ఫీజును 800 చేసి డబుల్ బాదుడు బాదుతున్నాడు. నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారని విమర్శించారు. ఆర్టీఏ చార్జీలు పెంచారని ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అని చెప్పి మగోళ్లకు డబుల్ టికెట్ రేట్లు పెంచారని ఆరోపించారు. బీరు సీసాలకు ధరలు పెంచారు. రేపటి నుంచి క్వార్టర్‍కు, విస్కీకి కూడా పెంచుతాడట. పెంచుడు, దంచుడు, కమిషన్లు కొట్టుడు తప్ప చేసిందేమీ లేదన్నారు. మనకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడా గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు.

Next Story