- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీలో కేటీఆర్, హరీశ్‌రావు
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా, లక్షల మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ మేరకు శనివారం కోకాపేటలోని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పకడ్బందీ కార్యాచరణ రూపొందించేందుకు చర్చలు కొనసాగాయి. 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కూడా సకాలంలో అందించకుండా సతాయించడం, ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్న ఉద్యోగులపై వివిధ రకాలుగా ఒత్తిడి తేవడం వంటి అంశాలను ఈ సందర్భంగా ఉద్యోగులు, ఇతర నాయకులు కేటీఆర్, హరీశ్ దృష్టికి తీసుకొచ్చారు.
ఉద్యోగులకు అండగా ఉంటాం..
ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎల్లవేళలా ఉద్యోగుల ఆకాంక్షలు, హక్కులపై సానుభూతితో ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వం లక్షల మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తుంటే వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఉద్యోగుల ఆకాంక్షల సాధనకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలకు నాయకత్వం వహిస్తున్న నేతలకు మద్దతుగా నిలవాలని, పార్టీలో ఉన్న ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రిటైర్డ్ నేతలను ఈ కార్యక్రమంలో కలుపుకోవాలని పార్టీ నాయకులు సూచించారు.






