శారద పీఠం, రాజశ్యామల ఆలయాన్ని కూల్చేందుకు కుట్ర: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఆగ్రహం

by Ramesh Naini |

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లతో పాటు దేవాలయాలు, మఠాలను కూల్చేందుకు కుట్రలు చేస్తోందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శారద పీఠం, రాజశ్యామల ఆలయాన్ని కూల్చేందుకు కుట్ర: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లతో పాటు దేవాలయాలు, మఠాలను కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కోకాపేట్ లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు రేవంత్ రెడ్డి పాలన తయారైందని విమర్శించారు. అడ్డగోలు వ్యవహారాలకు, అక్రమాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం ఏకంగా దేవాలయాలు, మఠాలను కూడా కూల్చే స్థాయికి దిగజారిందని ఆరోపించారు. 2019లో కేసీఆర్ ప్రభుత్వం కోకాపేట సర్వే నెంబర్ 240లో విశాఖ శారదా పీఠానికి చట్టబద్ధంగా క్యాబినెట్ ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. పీఠం నిర్వాహకులు ప్రభుత్వానికి రూ. 1 కోటి 5 లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడంతో పాటు హెచ్ఎండీఏకు రూ. 23 లక్షలు చెల్లించి అనుమతులు, విద్యుత్ కనెక్షన్ అన్నీ తీసుకున్నారని గుర్తు చేశారు. ఇక్కడ అద్భుతమైన శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి దేవాలయం, గోశాల, నిత్య అన్నదాన సత్రం, వేద పాఠశాల నిర్మించారు.. హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల సమక్షంలో పెద్ద స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్ట కార్యక్రమం జరిగిందని గుర్తుకు చేశారు. శారద పీఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారని వివరించారు.

ఖమ్మంలో 800 మందిని రోడ్డునపడేశారు..

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా అంటూ కట్టిన గుళ్లు, గోపురాలు, మఠాలను కూల్చడమే రేవంత్ రెడ్డి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేతతో పాటు, ఖమ్మంలో ఇళ్లు కూల్చి 800 మందిని రోడ్డునపడేశారని మండిపడ్డారు. కాంగ్రెస్​ పాలనలో అంతా కూల్చడమే తప్ప, నిర్మాణం లేదని ఎద్దేవా చేశారు. వాటర్ వర్క్స్ జలమండలి కోసం ఈ స్థలం తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది.. వాటర్ వర్క్స్ కట్టాలంటే ఈ దేవాలయం స్థలమే దొరికిందా..? అని నిలదీశారు. ఈ ఆలయానికి రోడ్డు ఎదురుగా సర్వే నెంబర్ 239, 240 లలో 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని అక్కడ వాటర్ వర్క్స్ కట్టుకోవచ్చుని సూచించారు. ఆ 17 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి తన అల్లుడికి, మేనల్లుళ్లకు, వాళ్ల అనుచరులకు భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఓఆర్ఆర్ కు కిలోమీటరు లోపల ఎలాంటి క్రషర్లు ఉండకూడదు.. కానీ రేవంత్ రెడ్డి తన అల్లుడి కోసం ఇక్కడ ఏకంగా 5 రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు పెట్టించారు.. పక్కన ఉన్న బిల్డర్లంతా తన అల్లుడి దగ్గరే కంకర కొనాలని, లేకపోతే అనుమతులు ఇవ్వమని బెదిరిస్తూ దందా చేస్తున్నారని ఆరోపించారు.

కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే ముందు పీఠాధిపతులతో మాట్లాడే కనీస సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. కేబినెట్‌లో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఈ దేవాలయాన్ని, మఠాన్ని కూల్చకుండా కాపాడాలని కోరారు. లేనిపక్షంలో ఈ దేవాలయ పరిరక్షణ కోసం బీఆర్ఎస్ భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంది.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడుకునే బాధ్యత మాదే.. ఎంత దూరమైనా పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వమని హెచ్చరించారు.

Next Story