- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao: గురుకులాల్లో చనిపోతున్న విద్యార్థులు.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్
గురుకులాల్లో వరుసగా చనిపోతున్న విద్యార్థుల వార్తలు విని ఊళ్లలోని తల్లిదండ్రులు భయపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన చెందారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Gurukula) గురుకులాల్లో వరుసగా చనిపోతున్న విద్యార్థుల వార్తలు విని ఊళ్లలోని తల్లిదండ్రులు భయపడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఆవేదన చెందారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ఒక ప్రకటనలో తెలిపారు. హన్మకొండ ధర్మసాగర్ మండలం కరుణాపురం మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో విద్యార్థి మృతి చెందిందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్టీ బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్, 15 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు అయ్యారని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం బీసీ గురుకులంలో పురుగులన్నం మాకొద్దు అంటూ విద్యార్థులు రోడ్డెక్కారని వివరించారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో 93 మంది విద్యార్థులు మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు.
గురుకులాల్లో జరుగుతున్న ఈ మరణ మృదంగానికి ఎవరు బాధ్యులు? అంటూ (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించరు. గురుకులాల ఖ్యాతి నానాటికీ దిగజారుతున్నదంటే దానికి కారకులు ఎవరు రేవంత్ రెడ్డి? నిలదీశారు. విద్యార్థులకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమన్నారు. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోందని ఆందోళన చెందారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. భావి తెలంగాణ భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం బలిపెడుతోందన్నారు.
నాడు దేశానికి దిక్సూచిలా నిలిచిన తెలంగాణ విద్యావ్యవస్థ.. నేడు దిక్కుతోచని స్థితికి చేరిందని ఆరోపించారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? అని ప్రశ్నించారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఫుడ్ పాయిజన్లు నిరోధించాలని, ఆత్మహత్యలు జరగకుండా తక్షణం చర్యలు చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






