హార్వర్డ్ లో సీఎం కాస్ట్లీ చదువు.. గురుకుల విద్యార్థులకు పాము కాట్లు: హరీశ్‌రావు ఆవేదన

by Ramesh Naini |

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త కలచివేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన చెందారు.

హార్వర్డ్ లో సీఎం కాస్ట్లీ చదువు.. గురుకుల విద్యార్థులకు పాము కాట్లు: హరీశ్‌రావు ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త కలచివేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన చెందారు. హార్వర్డ్ లో సీఎం కాస్ట్లీ చదువు.. గురుకుల విద్యార్థులకు పాము కాట్లు.. అంటూ మంగళవారం ఎక్స్ వేదికగా ఘటనపై స్పందించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంగతి దేవుడెరుగు ఉన్న గురుకులాల పరిస్థితి అధ్వాన్నం చేశారని ఆరోపించారు. పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన గురుకుల బిడ్డ ప్రాణానికి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, మీ పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా..? లేక విషసర్పాలకు ఆవాసాలా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా? అని నిలదీశారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ రంగుల లోకం చూపిస్తున్న మీరు గురుకులాలను గాలికి వదిలేయడం సిగ్గుచేటు.. అని విమర్శలు గుప్పించారు.

చావుతో పోరాడటానికి వెళ్తున్నారా?

గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కు లేదని, చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడు లేడని. అపరిశుభ్రత కారణంగా నేడు గురుకులాల్లో కుక్క కాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గం అని ఆరోపించారు. గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు పోజులిస్తే.. ఇక్కడ పేద విద్యార్థులు ఆసుపత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు. తమ పిల్లలు గురుకులాలకు చదువుకోవడానికి వెళ్తున్నారా? లేక చావుతో పోరాడటానికి వెళ్తున్నారా? అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలని, విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని కోరారు. పాము కాటు గురైన విద్యార్థిని అశ్మితకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు.. రాజకీయ కక్షసాధింపుల మీద ఉన్న శ్రద్ధలో కొంత అయినా పేద పిల్లల బతుకుపై పెట్టండని విమర్శించారు.

Next Story