- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రభుత్వ జల దోపిడీని అడ్డుకోవాలి.. గోదావరి జలాలు ఎత్తుకుపోయే కుట్ర : హరీశ్‌రావు
గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఏం చేస్తున్నట్లు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, (Godavari waters) గోదావరి జలాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, సీఎం, మంత్రులు ఏం చేస్తున్నట్లు? అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఇవాళ (శనివారం) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రూ. 80 వేల కోట్లతో నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం 50 శాతం నిధులు, మిగతా 50 శాతం ఎఫ్ఆర్‌బీఎం పరిధి మించి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయమని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం, కృష్ణా లేదా గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి అవసరమన్నారు. కానీ అందుకు విరుద్ధంగా, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని నిబంధనలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుంటే అడ్డుకోవాల్సిన కేంద్రం, నిధులిచ్చి సహకరించడం దుర్మార్గమన్నారు.
ఇది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీవ్ర అన్యాయమని వాపోయారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి ఏం లాభం? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం తీసుకుంటే, ఎఫ్ఆర్‌బీఎం కింద రికవరీ పెట్టారని, కానీ బనకచర్ల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా 50శాతం ఎఫ్ఆర్‌బీఎం పరిమితి మించి రుణం తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ, ఆంధ్రప్రదేశ్ పై వరాల జల్లులు కురిపిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
నాటి సమైక్య పాలకులు పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాల అక్రమ తరలింపునకు ప్రణాళిక వేస్తే, నేటి కాంగ్రెస్ నాయకుల సమక్షంలోనే బనకచర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీకి మార్గం సుగమం చేస్తున్నారు. కేంద్రాన్ని నిలదీయలేరు, ఏపీతో పోరాటం చేయలేరు.. చేతకాని ప్రభుత్వం వల్ల తెలంగాణ నష్టపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారాయని, నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి.. ఏపీ అక్రమ ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించి, ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.






