మంత్రి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలని: హరీష్ రావు డిమాండ్

by Gantepaka Srikanth |

‘నేను తప్పు మాట్లాడితే నన్ను ఉరి తీయండి. శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. లేదంటే ఖజానా కొల్లగొడుతున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మీద చర్యలు తీసుకోండి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సవాల్ విసిరారు.

మంత్రి పొంగులేటి తక్షణమే రాజీనామా చేయాలని: హరీష్ రావు డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘నేను తప్పు మాట్లాడితే నన్ను ఉరి తీయండి. శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. లేదంటే ఖజానా కొల్లగొడుతున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మీద చర్యలు తీసుకోండి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సవాల్ విసిరారు. శనివారం అసెంబ్లీలో మైనింగ్ శాఖ డిమాండ్స్ మీద జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కంచె చేను మేసిన చందంగా.. మైనింగ్ డిపార్ట్‌మెంట్ అనేది ప్రభుత్వానికి నాన్-టాక్స్ రెవెన్యూ తెచ్చిపెట్టే అత్యంత కీలకమైన శాఖ అని.. ఇలాంటి శాఖలో అధికారులు, ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా పని చేస్తే ఖజానాకు అంత డబ్బు వస్తుంని.. ఆ నిధులతో అభివృద్ధి, సంక్షేమం చేపట్టవచ్చని సూచించారు. కానీ, ఇవాళ మైనింగ్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణం జరుగుతున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నదన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున, నగరాన్ని ఆనుకునే పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ వ్యాపారాలు జరుగుతున్నాయని.. రక్షకుడే భక్షకుడిగా మారితే ఏం జరుగుతుందో.. అలాంటి పరిస్థితే ఇవాళ రాష్ట్రంలో దాపురించిందని పేర్కొన్నారు. జీవో 111 ఉల్లంఘిస్తూ రూల్స్, పర్మిషన్స్ లేకుండా దర్జాగా దందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శంషాబాద్ మండలం కోత్వాల్‌గూడ గ్రామంలో (సర్వే నెంబర్ 62, 63) ఎలాంటి కాలుష్య పరిశ్రమలు పెట్టకూడదని నిబంధనలు ఉన్నాయని.. కానీ, అక్కడ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ భారీ స్టోన్ క్రషర్‌ను డీజిల్ జనరేటర్లపై యథేచ్ఛగా నడుపుతున్నదని పేర్కొన్నారు.

కంట్రోల్ బోర్డుకి లేఖ రాశా..

ఈ ప్రభుత్వం తెచ్చిన జీవో 26 ప్రకారం స్టోన్ క్రషర్ పెట్టాలంటే మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలని.. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సీఎఫ్ఈ, సీఎఫ్ఓ సర్టిఫికెట్లు తీసుకోవాలని.. ఇందులో ఏ ఒక్క నిబంధన కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ పాటించలేదని ఆరోపించారు. ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకుండా డీజిల్ జనరేటర్ల మీద ఎందుకు నడపవలసి వస్తున్నదని ప్రశ్నించారు. దీనికి సంబంధించి మే 21, 2025న మైనింగ్ డైరెక్టర్ జనరల్ స్వయంగా ఈ క్రషర్‌పై తనిఖీకి ఆదేశించారని.. రెవెన్యూ, పీసీబీ, ఎస్‌పీడీఎల్, మైనింగ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి 5,130 మెట్రిక్ టన్నుల అక్రమ రఫ్ స్టోన్ నిల్వలను పట్టుకున్నారని తెలిపారు. అలాగే.. ఫిబ్రవరి 13, 2026న డిమాండ్ నోటీసు ఆదేశించారని.. కానీ, రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అసలు పట్టించుకోలేదని అన్నారు. మార్చి 4, 2026న మళ్లీ తనిఖీ చేయగా.. ఈసారి ఏకంగా 11,200 మెట్రిక్ టన్నుల ముడి సరుకు దొరికిందని.. అదేనెల 13న మరో షోకాజ్ నోటీసు ఇచ్చారని చెప్పారు. 5న ఎలాంటి అనుమతులు లేకుండా డీజిల్ జనరేటర్‌పై స్టోన్ క్రషర్ నడుపుతున్నారు, కాలుష్యానికి పాల్పడుతున్నారని స్వయంగా మైనింగ్ అధికారులే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి లేఖ రాశారని ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండుసార్లు పట్టుబడినా ఈ ప్రభుత్వం మౌనంగా ఉన్నదని ప్రశ్నించారు. ప్రతిపక్షానికో న్యాయం.. మంత్రులకో న్యాయమా? అని నిలదీశారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వల్ల మూసీ నది కాలుష్యానికి, గండిపేట్, హిమాయత్‌సాగర్‌లో కాలుష్యానికి కారణం అవుతుందని లిఖితపూర్వకంగా రాశారని.. దీనికి సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కంపెనీతో సంబంధం లేకపోతే మీరెందుకు భుజాలు తడుముకున్నారని నిలదీశారు. మంత్రి పొంగులేటి తక్షణమే నైతికంగా రాజీనామా చేసి, విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ‘మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఈ కుంభకోణంతో మీకు సంబంధం లేకపోతే.. ప్రతిపక్ష సభ్యులతో హౌస్ కమిటీ వేయండి.. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి’ అని సవాల్ విసిరారు.

Next Story