రేషన్ డీలర్ల పాలిట శకునిలా కాంగ్రెస్ ప్రభుత్వం.. కమీషన్‌ విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్

by Ramesh Naini |

రేషన్ డీలర్ల సమస్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.

రేషన్ డీలర్ల పాలిట శకునిలా కాంగ్రెస్ ప్రభుత్వం.. కమీషన్‌ విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రేషన్ డీలర్ల (ration dealers) సమస్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. ఈ మేరకు మంగళవారం రేషన్ డీలర్లు ఆయన కలిసి తమ గోడు వెళ్లబుచ్చారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. నెలల తరబడి రేషన్ కమీషన్ (Pending commission) చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గమన్నారు. పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్‌డీలర్లకు.. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయమని ఆరోపించారు. రేషన్‌ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్‌ అందక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణం అని ఆరోపించారు.

అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్ పెంపు చేస్తామని ప్రకటించారని గుర్తుకు చేశారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో నమ్మించి, ఇప్పుడు నట్టేట ముంచారని అన్నారు. మాటలు తప్ప చేతలు లేని కోతల ప్రభుత్వం ఇది అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సచివాలయానికి రేషన్ డీలర్లను ఆహ్వానించి వారి సమస్యలను విని పరిష్కరించామని గుర్తుకు చేశారు. మెట్రిక్ టన్నుకు ఇచ్చే కమీషన్‌ను 900 నుంచి 1400 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వంపై రూ. 139 కోట్ల అదనపు భారం పడుతున్నా రేషన్ డీలర్ల సంతోషం కోసం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు.

2014లో మెట్రిక్ టన్నుకు రూ. 200లుగా ఉన్న కమీషన్ ను, రూ.1,400 పెంచినట్లు తెలిపారు. 17 వేలకు పైగా ఉన్న రేషన్ డీలర్ల ముఖాల్లో చిరునవ్వులు నింపినమన్నారు. కమీషన్ చెల్లించడమే కాదు రేషన్ డీలర్ షిప్ వయోపరిమితిని 40 నుంచి 50 ఏళ్లకు పెంచినమన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామిని సైతం అమలు చేయకుండా రేషన్ డీలర్ల పాలిట శకునిలా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. రేషన్ డీలర్లకు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబురాన్ని లేకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సెప్టెంబర్ కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు రూ. 5 వేల గౌరవ వేతనం, కమీషన్ పెంపు ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

Next Story