Harish Rao: ఆఫీసులు నడపడం వేరు.. చదువులు చెప్పడం వేరు

by Gantepaka Srikanth |

విద్యా కమిషన్‌లో అసలైన విద్యావేత్తలు ఏరని.. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు.

Harish Rao: ఆఫీసులు నడపడం వేరు.. చదువులు చెప్పడం వేరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యా కమిషన్‌లో అసలైన విద్యావేత్తలు ఏరని.. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసిన ఒక్కరు కూడా లేకుండానే కొత్త విద్యా విధానం తయారు చేస్తారా అని ప్రశ్నించారు. విద్యాశాఖ మీద కనీస అవగాహన లేని వారితో కమిటీ వేసి విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్ చెలగాటం ఆడుతున్నదని పేర్కొన్నారు. విద్యా కమిషన్‌లో స్కూల్ పిల్లలకు గానీ, కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఎవరో చెప్పగలరా అని నిలదీశారు.

కమిటీ చైర్మన్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అని.. ఆయనొక ఇంజినీర్ అని తెలిపారు. ఆఫీసులు నడపడం వేరు.. చదువులు చెప్పడం వేరని పేర్కొన్నారు. పరిపాలనలో అనుభవం ఉన్నంత మాత్రాన.. పిల్లల సైకాలజీ, పాఠాలు చెప్పే పద్ధతుల మీద పూర్తి అవగాహన ఉన్నట్టా అని ప్రశ్నించారు. రెండేండ్లుగా విద్యాశాఖను గాలికి వదిలేసి.. ఇప్పుడు లేని వారితో కమిటీ వేసి కాలయాపన చేస్తారా అని ప్రశ్నించారు. కమిటీ ఇంత గొప్పగా ఉంటే.. వారిచ్చిన నివేదిక ఇంకెంత గొప్పగా ఉంటుందో అర్థమవుతున్నదని పేర్కొన్నారు. విద్యాశాఖను సీఎం ఎంత నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారో చెప్పడానికి ఈ కమిటీ ఏర్పాటే ఒక ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే నిర్ణయాలు ఆపి.. తక్షణమే విద్యావేత్తలకు ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు.

Next Story