Harish Rao: గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయండి: హరీశ్ రావు

by Prasad Jukanti |

కాంగ్రెస్ బీజేపీలు తోడు దొంగలు అని హరీశ్ రావు విమర్శించారు.

Harish Rao: గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయండి: హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీలు తోడు దొంగలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని మండిపడ్డారు.8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ తేలేకపోయారని, పక్క రాష్ట్రాలకు వేల కోట్లు ఇస్తుంటే మనకు గుండు సున్నా మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‍లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో కల్వకుర్తి బీజేపీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో, రాష్ట్ర హక్కులను కాపాడటంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. వీరి వ్యవహారం గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్లుగా ఉందన్నారు. హామీలు అమలు చేయకపోగా, ప్రజలకే కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని హరీష్ రావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను మా బాకీ పైసలు ఎప్పుడిస్తారని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు కేసీఆర్ హయాంలో కళకళలాడిన కల్వకుర్తి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు నేడు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో వెలవెలబోతున్నాయని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి, సామాన్యుడి ఆస్తి విలువను పాతాళానికి తొక్కేశారని విమర్శించారు. ఉత్తరాది రైతులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ రైతులపై బీజేపీకి లేదు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story