హార్వర్డ్ వెళ్లినా నీ చెత్త బుద్ధి మారలే.. కేసీఆర్ జాతి పితనే : సీఎంకు హరీశ్‌రావు కౌంటర్

by Ramesh Naini |

జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌ (Hate Speech) పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.

హార్వర్డ్ వెళ్లినా నీ చెత్త బుద్ధి మారలే.. కేసీఆర్ జాతి పితనే : సీఎంకు హరీశ్‌రావు కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌ (Hate Speech) పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారని సోమవారం ఎక్స్ వేదికగా తెలిపారు. కేసీఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని అన్నారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు.. రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అమెరికా వెళ్లి హార్వర్డ్ లో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదని హరీశ్ రావు అన్నారు. కనీస సంస్కారం రాలేదు, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే, తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతిపితనే రేవంత్ రెడ్డి.. అని కౌంటర్ ఇచ్చారు.

లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి..

నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది? అని నిలదీశారు. ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా, ప్రతిపక్షాలపై రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న నీకు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎలా అర్థం అవుతాయి రేవంత్ రెడ్డి? అని విమర్శించారు. నువ్వు హార్వర్డ్ వెళ్ళినా, అంతరిక్షం వెళ్లినా నీ చెత్త బుద్ధి మారదు, నోటి మురికి పోదు అన్నది సుస్పష్టం అవుతోందని హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.

Next Story