Harish Rao: ఇక్కడ రేవంత్ అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

by Ramesh Naini |

ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు.

Harish Rao: ఇక్కడ రేవంత్ అక్కడ చంద్రబాబు వచ్చాక సీన్ రివర్స్.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒకప్పుడు తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే.. ఏపీలో పది ఎకరాల భూమి వచ్చేది.. కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్కడ చంద్రబాబు (Chandrababu Naidu) వచ్చాక సీన్ రివర్స్ అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ఎకరా భూమి అమ్మితే తెలంగాణలో రెండెకరాల భూమి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ కు పాలన చేతకాక తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. సోమవారం ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. పెండ్లి కోసమో, చదువుల కోసమో భూములు అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. ఇంకో రెండు ఏళ్లు కాంగ్రెస్ పాలన ఉంటే భూముల రేట్లు సగానికి సగం అవుతాయన్నారు. ప్రజలందరూ కేసీఆర్ మళ్లీ రావాలని, సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్‌లు ఉంటే 16-18 పరిషత్‌లు బీఆర్ఎస్ సొంతం చేసుకోబోతోందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఉంటే, మెజార్టీ మండలాల్లో గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరం కలిసి ఒక కుటుంబం లాగా పనిచేయాలని సూచించారు. ఎట్లుండె తెలంగాణ ఎట్ల అయ్యింది అనేది ప్రజలకు అర్థం అయ్యేటట్లు చెప్పాలని సూచనలు ఇచ్చారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు అని మాట తప్పారని ఆరోపించారు. 12 వేల ఉద్యోగాలు ఇచ్చి, 60 వేలు ఇచ్చినం అని అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నరని, కేసీఆర్ లక్షా 68 వేల ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి అశోక్ నగర్‌లోని విద్యార్థులు, నిరుద్యోగులు సిద్ధమయ్యారని వెల్లడించారు. రాహుల్ గాంధీ పత్తా లేడు, రేవంత్ రెడ్డి పోలీసు వలయం పెట్టుకొని తిరుగుతున్నారని విమర్శలు చేశారు.

కాంగ్రెస్ వచ్చింది మళ్లీ రైతులకు తిప్పలు మొదలైనాయన్నారు. యూరియా కోసం పాస్ పుస్తకాలు, చెప్పులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా ఎరువుల కోసం లైన్ల నిలబడ్డరా? అని ప్రశ్నించారు. కరోనా వచ్చినా కూడా కేసీఆర్ గారు రైతుబంధు ఆపలేదని గుర్తుకు చేశారు. కానీ, ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధు ఎగ్గొట్టారని మండిపడ్డారు.

Next Story