- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి కార్మికుల దసరా బోనస్‌ను బోగస్ చేసిన కాంగ్రెస్ సర్కార్: హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా సీఎంపై మండిపడ్డారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పి, తీవ్ర నిరాశకు నెట్టారని ఆరోపించారు. మొత్తం లాభం రూ.6,394 కోట్ల నుంచి కాకుండా, రూ.2,360 కోట్ల నుంచి బోనస్ చెల్లించడం దారుణమన్నారు. పంచాల్సిన వాటాను తగ్గించి, శాతాలు పెంచి సింగరేణి కార్మికులను మోసం చేశారని అన్నారు. గతేడాది కూడా ఇదేవిధంగా మోసం చేసి, బోనస్ లో 50% వాటా కోత విధించారని తెలిపారు. మొత్తంగా సంస్థ గడించిన లాభాల ఆధారంగా ప్రతి ఏడాది కార్మికులకు ఇచ్చే బోనస్‌ను కూడా బోగస్ చేశారని ఆరోపించారు.
ఎంతో శ్రమించి సంస్థకు మంచి ప్రాఫిట్ చూపించినందుకు డబుల్ వాటా వస్తుందన్న కార్మికుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం అడియాశలు చేసిందన్నారు. గతంలో కేసీఆర్ సర్కార్ ఎప్పుడైనా నికర లాభంలో కార్మికులకు వాటా ఇచ్చారని. కాంగ్రెస్ మాత్రం వచ్చిన లాభాన్ని మూడో వంతు పక్కన పెట్టి మిగిలిన ఒక వంతులో వాటా ఇవ్వడం దుర్మార్గమన్నారు. గతేడాది సింగరేణి భవిష్యత్ ప్రణాళిక కోసమని పక్కన రూ.2,283 కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి అని, ఇప్పుడు రూ.4,034 కోట్ల సింగరేణి సొమ్ముకు ఎసరు పెట్టారని ఆరోపించారు. కార్మికులు చేసిన కష్టానికి, ఫలితం ఇవ్వకపోవడం దారుణమని, కార్మికులకు హక్కుగా రావాల్సిన వాటా ఎవరి జేబులకు మళ్లిస్తున్నట్లు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందరికీ వెలుగు అందించే కార్మికుల జీవితాల్లో చీకటి నింపే ప్రయత్నం చేస్తోందన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా కార్మికులకు చెల్లించినట్లుగానే లాభాల్లో వాటా చెల్లించాలని, నికర లాభం లో 34 శాతం బోనస్‌గా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని హెచ్చరించారు.






