'వెధవ, ఇడియట్' ఎక్సైజ్ కమిషనర్ తిట్ల దండకం.. డిప్యూటీ సూపరింటెండెంట్ రాజీనామా!

by Prasad Jukanti |   (  Updated:2026-04-11 09:14:44  IST  )

ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వేధింపులు తట్టుకోలేక డీఎస్ సోమిరెడ్డి రాజీనామా చేశారు. ఆత్మాభిమానం ముఖ్యం అంటూ ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

వెధవ, ఇడియట్  ఎక్సైజ్ కమిషనర్ తిట్ల దండకం.. డిప్యూటీ సూపరింటెండెంట్ రాజీనామా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో కమిషనర్ల్, డిప్యూటీ కమిషనర్ మధ్య వివాదం కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ తమను వేధిస్తున్నారని, ఆయన కారణంగా తాను ఆసుపత్రి పాలైనట్లు ఆరోపిస్తూ ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సోమిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అంతే కాదు హరికిరణ్ వేధింపుల సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. దీంతో కమిషనర్ తీరుపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హరికిరణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు పెన్ డౌన్ కు సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వెధవ, ఇడియట్ అంటూ..

ఇటీవల కానిస్టేబుల్ ట్రాన్స్ ఫర్ నిమిత్తం కమిషనర్ ఆఫీస్ కు వెళ్లినప్పుడు తన పట్ల హరికిరణ్ దుర్భాషలాడినట్లు సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అతడి మాటలను తట్టుకోలేక తాను కిందపడిపోయాయని దాంతో దీంతో తనను స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. తాను చాలా ఆవేదనకు గురైనట్లు, ఉద్యోగం వీడాలని నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యలో ఓ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసిన సోమిరెడ్డి.. 'ఉన్నతాధికారులకు, మిత్రులకు, ఎక్సైజ్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ప్రస్తుతం నా ఆరోగ్యం మంచిగానే ఉంది. మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. నాలాంటి వ్యక్తి ఈ శాఖలో ఇమడలేడని చాలా సార్లు అనిపించింది. నా మేలుకోరే ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో నెట్టుకొచ్చాను. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇక నేను ఇమడలేనని పూర్తిగా అర్థం అయింది. చేయని తప్పుకి వెధవ, ఇడియట్ అన్నప్పుడు నాలో సున్నిత మనస్తతం ఆ మాటను స్వీకరించలేకపోయింది. నేను ఒక్కటే మాట ఎదురు చెప్పాను. ఇలాంటి మాట అనొద్దు సార్ అని మాత్రమే. నేను ఎదురు చెప్పిన ఆ చి్న మాటకు కమిషనర్ గారి ఈగో హర్ట్ అయిందనుకుంటా. ఎవరు ఎన్నడు ఎదురు చెప్పి ఉండరు కదా! 10 నిమిషాలు పైగా నన్ను నువ్వు వెధవాతి వెధవవు, నువ్వు చేసిన వెధవ పనులు అంటూ నాకు సంబంధం లేనివి చదివాడు'.

ఆకలితోనైనా చస్తాం కాని..

'నా జీవితంలో ఎన్నడు ఎదుర్కోని ఘోర అవమానం చేశాడు. నాతోనే, నేను వేధవను అనిపించేలా ప్రయత్నం చేశాడు. అదే గదిలో నలుగురు అధికారులు మరియు సిబ్బంది ఉన్నారు. వారి ముందు ఆ విపత్కర పరిస్థితి చాలా మానసిక వ్యధకు గురి చేసింది. అయినా తట్టుకున్నాను. బయటకు వచ్చి విషయం మిత్రులకు, అధికారులకు చెప్పాను. అలా ఎలా మనల్ని అంటాడని అందరికీ చెప్పాను. ప్రశ్నిద్దాం అనిచెప్పాను. కమిషనర్ అవమానించినదాని కన్నా కూడా అన్యాయాన్ని ప్రశ్నిద్దాం అన్నప్పుడు ఆలోచనలో పడ్డ అధికారుల మరియు మిత్రుల భయం, మౌనం నన్ను బాగా కలచి వేసింది. అక్కడే కుప్పకూలిపోయాను. మిత్రులు హాస్పిటల్ కు చేర్చారని తర్వాత తెలిసింది. వారికి నా కుటుంబం తరఫున కృతజ్ఞతలు. అరేయ్, ఒరేయ్, వెధవ, ఇడియట్, యూస్ లెస్ ఫెలో ఇలా చాలా అవమానకరమైన పదాలతో తిట్టినా, దూషించినా ఇన్నాళ్లు నెట్టుకొస్తున్న అధికారులకు, మిత్రులకు ఇతర అధికారులకు నమస్కారం, నేను పరిగిన వాతావరణంలో ఆత్మాభిమానంతో బ్రతకడమే జీవింతం అని నమ్మాను. ఆకలితోనైనా చస్తాం కాని ఆత్మాభిమానం వదులుకోలేం. అన్న కాళోజీ మాటలు యాది చేసుకుంటూ చేతకాని చావలేని, చైతన్యం చచ్చిపోయిన శాఖలో 30 సంవత్సరాలు పని చేసినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులతో చర్చించాను. ఆత్మాభిమానం కన్నా ఉద్యోగం ముఖ్యం కాదని తలచి శాఖను(ఉద్యోగం) వీడి వెళ్లాలని బాధతో నిర్ణయించుకున్నాను. ఇన్ని సంవత్సరాలు నాతో ప్రయాణం చేసిన, నాకు సహకరించిన ఉన్నతాధికారులకు మిత్రులకు, సిబ్బందికి కృతజ్ఞతలు. ఈ పోస్టు ఎంతో మానసిక సంఘర్షణకు లోనై పెడుతున్నాను' అంటూ రాసుకొచ్చారు.

Next Story