చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలి.. ప్రధాని మోడీకి మంత్రి తుమ్మల లేఖ

by Kema Shiva Kumar |

తెలంగాణ రాష్ట్ర హస్తకళల పరిశ్రమకు ఊపిరిలాంటి చేనేత రంగం, చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీతో ప్రస్తుతం చేనేత రంగం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలి.. ప్రధాని మోడీకి మంత్రి తుమ్మల లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర హస్తకళల పరిశ్రమకు ఊపిరిలాంటి చేనేత రంగం, చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధించిన 5 శాతం జీఎస్టీతో ప్రస్తుతం చేనేత రంగం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఈ రంగం, గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులకు జీవనాధారం అవుతోందని తెలిపారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ కాటన్, పట్టు చీరలు, నారాయణపేట కాటన్, పట్టు చీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దర్రీస్, కరీంనగర్ డబుల్ క్లాత్ చెద్దర్లు, ఇతర చేనేత వస్త్రాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. అందులో ఆరు ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కింద నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,046 మంది చేనేత కార్మికులు, 34,569 మంది అనుబంధ కార్మికులు ఈ రంగంలో పని చేస్తున్నారని పేర్కొన్నారు.

ముడి సరుకుల ధరలు పెరగడం, పవర్‌లూమ్, మిల్ రంగాలు తక్కువ ఉత్పత్తి వ్యయంతో వస్త్రాలు తయారు చేయడంతో, మార్కెట్లో చేనేత వస్త్రాలు తయారు చేసే నేత కార్మికులకు గిరాకీలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ దానికి తోడు 5 శాతం జీఎస్టీని విధించడంతో చేనేత ఉత్పత్తుల ధరలు పెరిగి వినియోగం తగ్గిపోతుందని, కార్మికుల జీవనాధారం సంక్షోభంలో పడుతోందని తెలిపారు. జీఎస్టీ కారణంగా నష్టపోతున్న నేతన్నలు తమ సంప్రదాయ వృత్తిని వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందన్నారు.

ఖాదీ రంగం, చేనేత రంగం రెండూ సహజసిద్ధమైన గ్రామీణ పరిశ్రమలుగా ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఖాదీ ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపు ఉండగా, చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని కొనసాగించడం అన్యాయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాలు, కార్మికులు ఈ పన్నును వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే చేనేత కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు.. వారికి నిరంతరం ఉపాధి కల్పించేందుకు భారతీయ చేనేత కళా వారసత్వాన్ని భావితరాలకు అందించడానికి చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని మినహాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హస్తకళ, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశారు.

Next Story