- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Group politics: రాష్ట్రమంతా ఒక తీరు.. నడిగడ్డలో మరోతీరు
పార్టీ గుర్తు కాదు.. నాయకుల ఆధిపత్యమే పంచాయతీ ఫలితం

రాష్ట్రవ్యాప్తంగా ఆయా పార్టీల రాజకీయం ఒక విధంగా ఉంటే జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మొదటి విడత ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీల ఖాతాలో పడుతుండగా, జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం నాయకుల వ్యక్తిగత ఖాతాలకు జమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఆయా పార్టీల మద్దతుదారులుగా కాకుండా ‘ఫలానా బడా నేత అనుచరుడు’ పేరు మీదుగానే ప్రచారమయ్యాయి. అధికార పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ సరితాతిరుపతయ్య వర్గాలు తమ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో నియోజకవర్గంపై పట్టు సాధించుకునేందుకు పోటాపోటీగా తమ వర్గీయులను బరిలోకి దించాయి. దీంతో 90శాతం స్థానాలు వీరిద్దరి వర్గాలకే దక్కగా, బాసు హనుమంతునాయుడు, రంజిత్ కుమార్ వర్గీయులు, బీజేపీ అభ్యర్థులు మిగిలిన స్థానాలను గెలుచుకున్నారు. ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగినా వ్యక్తిగత నాయకత్వానికే ప్రాధాన్యత దక్కింది.
దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు, ఎన్నికలు ఒకలా ఉంటే... జోగులాంబ గద్వాల జిల్లాలో(Jogulamba Gadwal District) అందుకు భిన్నంగా ఉండడం చర్చనీయాంశం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీల ఖాతాలో పడుతుండగా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఫలితాలు మాత్రం నాయకుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అవుతున్నాయి. గురువారం మొదటి విడతగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రధాన రాజకీయ వర్గాలలో ఫలానా ఊరు నుంచి గెలిచిన సర్పంచ్.. ఫలానా బడా నేత అనుచరుడు అని ప్రకటించుకున్నారు. సామాజిక మాధ్యమాలలోనూ పార్టీలకు దూరంగా, ఫలానా నాయకుల మద్దతుదారులు అంటూ ప్రచారం సాగింది. ఒక్క బీజేపీ మినహాయిస్తే ఎక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అన్న పదాలు లేకుండా ఫలితాలు వచ్చాయి. వచ్చిన ఫలితాల్లో గెలుపొందిన అభ్యర్థుల జాబితాలో ఏ నాయకుడి అనుచరులు ఎంతమంది గెలిచారు అన్న వివరాలను సేకరించి, వారి వారి అనుచరులు తమ ఆధిపత్యాలను చాటుకునే విధంగా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేసుకున్నారు. ప్రత్యేకించి అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య వర్గాలు, బీఆర్‌ఎస్ నేత బాసు హనుమంతునాయుడు వర్గం, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్ వర్గానికి చెందిన అభ్యర్థులు పోటీలో ఉండగా, గ్రామాల వారిగా ఏ ముఖ్య నాయకుడి అనుచరులు గెలిచారంటూ చర్చలు జరిగాయి.
అధికార పార్టీలో రెండు వర్గాలు...
గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితాతిరుపతయ్య మధ్య మొదటి నుంచి సయోధ్య లేక ఎవరి దారిలో వారు ముందుకు సాగుతున్నారు. వారి మధ్య విభేదాలను తొలగించేందుకు అధిష్టానం సైతం చర్యలు తీసుకోకపోవడంతో విభేదాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ కారణంగా నియోజకవర్గంపై పట్టు సాధించుకునేందుకు వీలుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితాతిరుపతయ్య తమ తమ వర్గీయులను పోటీలో దించారు. మరోవైపు బీఆర్‌ఎస్ ముఖ్యనేత బాసు హనుమంతునాయుడు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్ సైతం పలుచోట్ల తమ అనుచరులను పోటీలో దించారు. ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరగడంతో వ్యక్తిగత ప్రాధాన్యత ఈ నియోజకవర్గంలో పెరిగింది. ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ మద్దతుదారులు పోటాపోటీగా 90శాతం స్థానాలను దక్కించుకున్నారు. హనుమంతునాయుడు వర్గీయులు, రంజిత్ కుమార్ వర్గీయులు కొన్ని స్థానాలను గెలుచుకున్నారు. బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టకపోయినప్పటికీ 10స్థానాలను దక్కించుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.






