బెడిసికొడుతోన్న BRS నయా ప్లాన్.. మొదటికే ఎసరు తెస్తోన్న ‘‘ఆత్మీయ’’ వ్యూహాం?!

by Disha Web Desk 19 |
బెడిసికొడుతోన్న BRS నయా ప్లాన్.. మొదటికే ఎసరు తెస్తోన్న ‘‘ఆత్మీయ’’ వ్యూహాం?!
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేతలకు కార్యకర్తల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది.ఈ సమ్మేళనాలే గ్రూపు రాజకీయాలకు మరో మారు వేదికవుతున్నాయి. పార్టీ క్యాడర్ సైతం నేతల తీరును సమ్మేళనాల సమావేశంలోనే నిలదీస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్నప్పటికీ తమకు గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమ సమస్యను విన్నవించుకుందామనుకున్న నేతలు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. అలాంటప్పుడు పార్టీలో ఉండి లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజల వద్దకు ఎన్నికల సమయంలో ఎలా పోవాలని మీరే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను ఏప్రిల్ 25వ తేదీ లోపు పూర్తిచేయాలని పార్టీ అధిష్టానం శ్రేణులను ఆదేశించింది. అందుకోసం జిల్లాలకు సమన్వయకర్తలుగా జిల్లా ఇన్చార్జిలను నియమించింది. జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు విజయవంతం చేసేందుకు సమన్వయకర్తలను నియమించినప్పటికీ వారి ముందే అసంతృప్తి బయటపడుతుంది.

తెలంగాణ భవన్లో ఈనెల 21న నిర్వహించిన హైదరాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలు నేతలను నిలదీశారు. మంత్రి తలసాని మంత్రి మహమూద్ అలీ ముందే పార్టీ కార్యకర్తలు నేతల తీరును తప్పుపట్టారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా సమన్వయకర్త దాసోజు శ్రవణ్ నిర్వహించాల్సిన అన్ని తానే తలసాని నిర్వహించడంతో జిల్లా అధ్యక్షుడే గైర్హాజరయ్యారనే విమర్శలు వచ్చాయి. అంతేకాదు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా గైర్హాజరయ్యారు.

కరీంనగర్లో రెండు రోజుల క్రితం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ కేడర్ నేతల తీరును తప్పు పట్టారు. కలుపుకొని పోవడం లేదని పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్‌ను నిలదీశారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో సైతం మంత్రి సబిత నేతలను కలుపుకపోవడం లేదని.. సీనియర్లను ఆత్మీయ సమ్మేళనాలకు పిలవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

శనివారం మహేశ్వరం నియోజకవర్గ నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయిన కొత్త మనోహర్ రెడ్డి మీడియా వేదికగా మంత్రి సబితపై విమర్శలు చేశారు. ఉద్యమకారులకు పార్టీ ఆది నుంచి పనిచేస్తున్న నేతలకు అన్యాయం జరుగుతుందని.. సబితా ఇంద్రారెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని బహిరంగంగా విమర్శలు చేశారు. ఇలా పలు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను పురస్కరించుకొని విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీలో అసంతృప్తి మరోసారి బహిర్గతం అవుతుంది.

రాబోయే ఎన్నికలకు ఎఫెక్ట్..

రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నేతలకు కేడర్ మధ్య ఉన్న గ్యాప్ గెలుపు పై ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాదు నియోజకవర్గాల్లో జరుగుతున్న సమావేశాలకు సైతం కొంతమంది నేతలకు ఆహ్వానం ఉండకపోవడం.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికి వారుగా వారి అనుచరులకు మాత్రమే ఆహ్వానిస్తుండడంతో ఉద్యమకారులు పార్టీ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. పార్టీ అధిష్టానం అందరిని కలుపుకొని పోవాలని సూచిస్తున్నప్పటికీ కింది స్థాయి నేతలు తీరు మార్చుకోకపోవడంతో రాబోయే ఎన్నికల్లో గడుకాలమేనని పార్టీ నేతలే పేర్కొంటున్నాడ విశేషం.

Next Story