నాడు కేసీఆర్ నేడు రేవంత్ రెడ్డి.. మళ్లీ మొదటికి వచ్చిన గ్రూప్-1 కథ!

by Prasad Jukanti |   (  Updated:2025-09-09 06:53:31  IST  )

తెలంగాణ గ్రూప్-1 ఇష్యూలో రాజకీయ రణరంగం తప్పదా?

నాడు కేసీఆర్ నేడు రేవంత్ రెడ్డి.. మళ్లీ మొదటికి వచ్చిన గ్రూప్-1 కథ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్-1 (Group-1) నోటిఫికేషన్ బాలారిష్టాలు దాటడం లేదు. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు అయినా మొట్టమొదటి గ్రూప్-1 పోస్టుల నియామక ప్రక్రియ తీరం దాటడం లేదు. ఈ నియామకాల విషయంలో తాజాగా మరోసారి హైకోర్టు షాకింగ్ నిర్ణయం వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంగింగ్ లిస్ట్, మార్కుల జాబితాను హైకోర్టు (Telangana High Court) రద్దు చేసింది. మెయిన్స్ అభ్యర్థుల పేపర్లు పునఃమూల్యాంకనం చేయాలని ఆదేశించింది. ఇది సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీకి 8 నెలల గడువు విధిస్తూ ఆదేశించింది. దీంతో గ్రూప్-1 కథ మళ్లీ మొదటికి వచ్చిందా అనే చర్చ తెరపైకి వస్తోంది. అసలే ఇది ఎన్నికల సీజన్. త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి బై పోల్, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిచాల్సిన వేళ నిరుద్యోగులు వర్సెస్ ప్రభుత్వం మధ్య గ్రూప్-1 పాలిటిక్స్ రచ్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అప్పీల్ కు వెళ్లే యోచనలో టీజీపీఎస్సీ:

గ్రూప్-1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు.. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు జులై 7న ముగియగా తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఇవాళ వెలువరించింది. అయితే గ్రూప్-1 ఫలితాల విషయంలో హైకోర్టు నిర్ణయంపై టీజీపీఎస్సీ (TGPSC) అప్పీల్ కు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. పునః మూల్యాంకనం చేయాలని ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీజీపీఎస్సీ గనుక అప్పీల్ కు వెళ్తే తాము కూడా డివిజన్ బెంచ్ లో వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రూప్-1 మెయిన్స్ అర్హత సాధించిన అభ్యర్థులు చెబుతున్నారు. అయితే గ్రూప్-1 విషయంలో ఇప్పటికే ఆదరాబాదరా నిర్ణయాల వల్ల హైకోర్టులోను ఎదురుదెబ్బ తిన్న నేపథ్యంలో రీ ఎగ్జామ్ నిర్వహించడమే ప్రభుత్వానికి మంచిదని గ్రూప్-1 అభ్యర్థులు కోరుతుండగా హైకోర్టు నిర్ణయంతో ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు.

నాడు కేసీఆర్ నేడు రేవంత్ రెడ్డి:

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 503 పోస్టుల భర్తీ కోసం 2022 ఏప్రిల్ లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022 అక్టోబర్ లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదలైనా పేపర్ లీకేజ్ కారణఁగా ఆ పరీక్ష రద్దైంది. దాంతో 2023 జూన్ లో మరోసారి పరీక్షలు నిర్వహించారు. అయితే ఈసారి పరీక్షల నిర్వహణలోని లోపాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా మరోసారి హైకోర్టు పరీక్షలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 19న మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత మెయిన్స్ నిర్వహించిన టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చిలో తుదిఫలితాలు రిలీజ్ చేసింది. అయితే మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కోర్టుకు వెళ్లగా కోర్టులో టీజీపీఎస్సీకి ఎదురుదెబ్బతగలడం సంచలనంగా మారింది. దీంతో గతంలో కేసీఆర్ (KCR) సర్కార్ ను ముప్పుతిప్పలు పెట్టిన గ్రూప్-1 అంశంలో రేవంత్ రెడ్డి (RevanthReddy) సర్కార్ ఎలా ముందుకు వెళ్లబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

Read More: హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీష్ రావు

Next Story