- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Group-1: గ్రూప్-1 పాలిటిక్స్.. కాంగ్రెస్‌కు సొంత నేతల టెన్షన్!
తెలంగాణలో గ్రూప్-1 కొలువు సాధించాలన్న నిరుద్యోగుల ఆశలు అడియాశలుగానే మారుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గ్రూప్-1 (Group-1)కొలువు సాధించాలన్న నిరుద్యోగుల ఆశలు అడియాశలుగానే మారుతున్నాయి. రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగం అభ్యర్థుల సహనాన్ని ఇంకా పరీక్షిస్తూనే ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో బాలారిష్టాలను దాటుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సారి గ్రూప్-1 నియామక ప్రక్రియ సజావుగా ముగుస్తుందనుకునే లోపే కథ మళ్లీ మొదటికి వచ్చింది. టీజీపీఎస్సీ (TGPSC) వెలువరించిన గ్రూప్-1 ఫలితాల పట్ల అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని, ఫలితాల్లో ఇంగ్లిష్ మీడియం వారికి ఎక్కువ మార్కులు.. తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వచ్చాయని అభ్యర్థులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వారికి పలువురు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు మద్దతు తెలుపుతున్నారు. ఇంతలో తుది నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేయడం, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కార్నర్ చేయడం తెలంగాణలో గ్రూప్-1 రాజకీయ దుమారంగా మారింది.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్‌రెడ్డి
2022లో 503 పోస్టుల భర్తీకి తొలిసారి విడులైన గ్రూప్-1 నోటిఫికేషన్ అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. కేసీఆర్ హయాంలో 2023 జూన్‌లో ప్రిలిమ్స్ నిర్వహించగా పరీక్ష పేపర్ల లీకేజీ కారణంగా ఓ సారి, 2023 మరోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా బయోమెట్రిక్ తీసుకోలేదనే కారణంతో రెండోసారి ఈ పరీక్ష రద్దు అయింది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గ్రూప్-1 ఉద్యోగాల భర్తీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల కలలను నీరుగార్చిందనే ఆరోపణల నేపథ్యంలో పాత నోటిఫికేషన్‌ను రేవంత్ సర్కార్ రద్దు చేసింది. 2024 ఫిబ్రవరిలో మరో 60 పోస్టులను కలిపి మొత్తం 563 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహించి ఫలితాలను వెల్లడించింది. తమ కష్టానికి ఫలితం దక్కనుందని ఆశించిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెలవరించిన ఫలితాలు చూశాక షాక్ అయ్యారు. ఫలితాల వెల్లడిలో తెలుగు మీడియం వారికి తీరని అన్యాయం జరిగిందని, రీ వాల్యూయేషన్ నిర్వహించాలని కోరుతున్నారు.
ప్రతిపక్షాల క్రెడిట్ పాలిటిక్స్
అయితే ఈ ఫలితాల విషయంలో తాజాగా అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో బీఆర్ఎస్ (BRS), బీజేపీలు (BJP) ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతున్నాయి. గ్రూప్-1లో భారీగా అవకతవకలు జరిగాయని, దీనిపై జ్యుడీషియల్ కమిటీ వేయాలని, సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నుంచి ఇప్పటికే పలువురు నేతలు మీడియా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా గ్రూప్-1ను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని సీఎంకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఇదిలా ఉంటే గ్రూప్-1 నియామకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు తమ పోరాటం వల్లేనని బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు క్రెడిట్ పాలిటిక్స్‌కు తెరలేపడం రాజకీయంగా మరింత హాట్ టాపిక్‌గా మారుతోంది.
కాంగ్రెస్ నేతల తీరుతో ప్రభుత్వానికి కొత్త చిక్కులు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియ వేగవంతంగా చేపట్టడం పట్ల రాష్ట్రంలోని నిరుద్యోగ యువతతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న వారి తల్లిదండ్రులలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కొంత సానుకూల ధోరణి ఏర్పడింది. అయితే గ్రూప్-1 ఫలితాల వివాదం ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారింది. మరోవైపు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది యువ నేతలు స్పందిస్తున్న తీరు.. నిరుద్యోగుల ఆగ్రహానికి ఆజ్యం పోస్తున్నదనే టాక్ వినిపిస్తోంది. వాల్యూయేషన్ చేసిన వారిపై ఆరోపణలు చేసిన వారిని చెప్పుతో కొట్టాలని, తమకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న అభ్యర్థులను మీ అర్హతలేంటి? అని ఎదురు ప్రశ్నించి చులకన చేసి మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూప్-1 అంశాన్ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలని, ఏ మాత్రం తేడా కొట్టిన అది ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్‌గా మారుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి ఈ ఇష్యూను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సాల్వ్ చేయబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.






