- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Court : హైకోర్టులో కొనసా..గుతున్న గ్రూప్ 1 వాదనలు
తెలంగాణ హైకోర్టు(High Court)లో గ్రూప్-1(Group 1) మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సోమవారం కూడా కొనసాగింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్టు(High Court)లో గ్రూప్-1(Group 1) మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సోమవారం కూడా కొనసాగింది. 2024 అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది విద్యా సాగర్ రావు ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తారు: (1) హాల్ టికెట్ నంబర్లు ప్రిలిమ్స్, మెయిన్స్ దశల మధ్య మార్చడం ద్వారా పరీక్షా కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయనడం (2) అర్హత లేని డిగ్రీ కాలేజీ లెక్చరర్లను వాల్యుయేషన్ నిపుణులుగా నియమించడం, ఒక్కో పేపర్‌ను కేవలం ఐదు నిమిషాల్లో మూల్యాంకనం చేయమని సూచించడం.
(3) తెలుగు మాధ్యమంలో జవాబు పత్రాలు రాసిన అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం. ఈ అంశాల ఆధారంగా, పిటిషనర్లు మెయిన్స్ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయడం లేదా పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోర్టును కోరారు. అయితే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తరపు న్యాయవాది ఎస్. నిరంజన్ రెడ్డి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పరీక్ష నిర్వహణ సరిగ్గా, పారదర్శకంగా జరిగిందని, హాల్ టికెట్ నంబర్లలో వైవిధ్యాలు సాధారణమని, వాల్యుయేషన్ నిపుణులు అర్హులైన వారేనని వాదించారు. కొందరు అభ్యర్థులు మార్కులు మార్చడానికి ఫోర్జరీకి పాల్పడగా.. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
జస్టిస్ నమవరపు రాజేశ్వర రావు నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్లపై విచారిస్తూ.. వాదనలను త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటికే చేసిన వాదనలను రిపీట్ చేయవద్దని, కొత్త అంశాలను మాత్రమే సమర్పించాలని ఆదేశించింది. వాదనలు పూర్తి కాకపోతే రాతపూర్వకంగా సమర్పించాలని కోర్టు సూచించింది. ఈ విచారణలో గత ఏప్రిల్ 17న, కోర్టు నియామక పత్రాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే సర్టిఫికేట్ ధృవీకరణ ప్రక్రియ కొనసాగనివ్వాలని ఆదేశించింది. టీజీపీఎస్సీ ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. గతవారంలో వరుసగా నాలుగు రోజులు ఈ కేసులో వాదనలు జరగగా.. నేడు కూడా కొనసాగాయి. అయితే కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందోనని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.






