పోలీస్ స్ట్రాటజీలో బిగ్ షిఫ్ట్.. కొత్త టార్గెట్ ఇదే!

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో నక్సలిజం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో.. దశాబ్దాల పాటు అడవుల్లో మావోయిస్టుల ఏరివేతే ఏకైక లక్ష్యంగా సాగిన పోలీసుల ఆపరేషన్లు ఇప్పుడు దిశను మార్చుకుంటున్నాయి.

పోలీస్ స్ట్రాటజీలో బిగ్ షిఫ్ట్.. కొత్త టార్గెట్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నక్సలిజం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో.. దశాబ్దాల పాటు అడవుల్లో మావోయిస్టుల ఏరివేతే ఏకైక లక్ష్యంగా సాగిన పోలీసుల ఆపరేషన్లు ఇప్పుడు దిశను మార్చుకుంటున్నాయి. కాలక్రమంలో నేరాల తీరు మారడం, సైబర్, మాదకద్రవ్యాల నార్కోటిక్స్ ముప్పు తీవ్రమవుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అందుకు అనుగుణంగా వ్యూహాలను పునర్నిర్మిస్తోంది. ఇందులో భాగంగా.. ఇన్నాళ్లు మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్‌ఐబీ, అడవుల్లో గెరిల్లా యుద్ధతంత్రాల్లో ఆరితేరిన గ్రేహౌండ్స్ కమెండోల సేవలను ఆధునిక నేరాల నియంత్రణ వైపు మళ్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సిబ్బందిని అవసరమైన సైబర్, నార్కోటిక్స్ విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

ముగిసిన ఆపరేషన్లు..

1989లో అప్పటి ఐపీఎస్ అధికారి కేఎన్ వ్యాస్ సారథ్యంలో ఏర్పాటైన గ్రేహౌండ్స్.. అనతికాలంలోనే దేశంలోనే అత్యుత్తమ యాంటీ నక్సల్ ఫోర్స్‌ గా గుర్తింపు పొందింది. గత 37 ఏళ్లలో మావోయిస్టుల ఏరివేతలో అనేక విజయాలు సాధించిన ఈ విభాగం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నక్సల్స్ నియంత్రణ కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ మెరుగైన పునరావాస పథకాల ఫలితంగా మావోయిస్టుల కార్యకలాపాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. గత రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా 818 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అడవుల్లో వారి సంచారం దాదాపు లేకపోవడంతో, ప్రత్యేక బలగాల అవసరం అటవీ ప్రాంతాల్లో తగ్గిపోయింది. ఈ క్రమంలోనే గ్రేహౌండ్స్, ఎస్ఐబీ విభాగాల్లో మార్పులకు ప్రణాళికలు రూపొందించారు.

సైబర్, డ్రగ్స్ పై ఉక్కుపాదం

అడవుల్లో నక్సల్స్ ముప్పు తగ్గినా.. పట్టణాలు, నగరాల్లో సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా రూపంలో కొత్త సవాళ్లు పోలీసుల ముందున్నాయి. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌ లో సుమారు 1,700 మంది సిబ్బంది ఇతర విభాగాల నుంచి డిప్యూటేషన్ పై విధుల్లో ఉన్నారు. తాజా వ్యూహం ప్రకారం.. వీరిలో సుమారు సగం మందిని తిరిగి వారి మాతృ విభాగాలకు లేదా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఏళ్ల తరబడి కఠిన శిక్షణ తీసుకుని, ఆపరేషన్లలో రాటుదేలిన మిగిలిన గ్రేహౌండ్స్ కమెండోల అపార అనుభవాన్ని వృథా పోనివ్వకుండా.. రాష్ట్ర భద్రత కోసం కొత్తగా ఏర్పాటవుతున్న ఈగల్ ఫోర్స్ లో వినియోగించుకోనున్నారు. వీరికి సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ కట్టడికి సంబంధించిన ప్రత్యేక బాధ్యతలను అప్పగించనున్నారు.

డిజిటల్ ట్రాకింగ్ వైపు ఎస్ఐబీ..

ఇక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబీ పాత్ర కూడా పూర్తిగా మారనుంది. ఇప్పటివరకు అడవుల్లో మావోయిస్టుల కదలికలు, నెట్‌వర్క్‌ ను పసిగట్టిన ఎస్ఐబీ నిఘా.. ఇకపై తమ దృష్టిని డిజిటల్ ప్రపంచం వైపు మళ్లించనున్నారు. ఆన్‌లైన్‌లో సైబర్ నేరగాళ్ల మూలాలను ట్రాక్ చేయడం, డ్రగ్స్ మాఫియా ఆర్థిక లావాదేవీలను ఛేదించడం, ఇతర అంతర్గత భద్రతా అంశాలపై వీరు నిఘా పెట్టనున్నారు. క్షేత్రస్థాయిలో అజ్ఞాత వ్యక్తుల నెట్‌వర్క్‌ లను ఛేదించడంలో ఎస్ఐబీకి ఉన్న సుదీర్ఘ అనుభవం అంతర్రాష్ట్ర సైబర్, డ్రగ్స్ ముఠాలను పట్టుకోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆయుధాలతో అడవుల్లో పోరాడిన బలగాలు, ఇప్పుడు సాంకేతికతను ఆయుధంగా మలచుకుని ఆధునిక నేరాలపై పోరాడేందుకు సన్నద్ధం అవుతుండటం పోలీసు శాఖలో ఒక సరికొత్త పరిణామంగా చెప్పొచ్చు.

Next Story