సాదాబైనామా క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్: మార్గదర్శకాలు జారీ చేసిన CCLA

by Kema Shiva Kumar |

తెలంగాణలో సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి సీసీఎల్ఏ (CCLA) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

సాదాబైనామా క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్: మార్గదర్శకాలు జారీ చేసిన CCLA
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి సడలించిన నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సీసీఎల్ఏ డీకే లోకేశ్ కుమార్ గత నెల 30న సర్క్యులర్ జారీ చేశారు. జీవో నం.76, 77ల ప్రకారం చేయాలని పేర్కొన్నారు. కానీ నిర్ధిష్టంగా ఎలాంటి మార్గదర్శకాలూ లేకపోవడం గమనార్హం. జీవో 76, 77లకు అనుగుణంగా దరఖాస్తులను చూడాలి. కలెక్టర్ల మార్గనిర్దేశంలో ఆర్డీవోలు పరిష్కరించాలి. ఐతే గత నెల 30న రూపొందించారు. కానీ ఈ నెల 8న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు, ఆర్డీవోలకు వివరించారు. గురువారం నాటికి కూడా కొందరు ఆర్డీవోలకు ఈ సర్క్యులర్ కాపీ అందకపోవడం గమనార్హం. సాదాసీదాగా ఉన్న ఈ గైడ్‌లైన్స్ కాపీ గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. ఇంకా అనేక సందేహాలు క్షేత్ర స్థాయిలో ఉన్నప్పటికీ గైడ్‌లైన్స్‌లో అవేవీ పేర్కొనకపోవడం వల్ల దరఖాస్తుల తిరస్కరణకే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిసింది.

కొత్త మార్గదర్శకాలు ఇవే..

– 2020 అక్టోబర్ 12 నుంచి 2020 నవంబరు 10 వరకు స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించండి.

– అర్హతలు, హక్కులు, పొసెషన్, డాక్యుమెంట్లను ఆర్డీవో పరిశీలించాలి.

– సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన వారి నుంచి అఫిడవిట్ తీసుకోవాలి. దాంతో పాటు డాక్యుమెంట్లు జత చేయాలి.

– జీవో 77లో పేర్కొన్నట్లుగా అప్పటి గ్రామీణ ప్రాంతాలైతే పరిష్కరించాలి. అంటే ప్రస్తుతం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిసిన రెవెన్యూ గ్రామాల్లోని దరఖాస్తులనూ పరిష్కరించాలి.

– నిర్ధిష్ట కాల పరిమితిలో దరఖాస్తులను డిస్పోజ్ చేయాలి.

– విచారణ తర్వాత భూ భారతి పోర్టల్‌లో 30 రోజులు ఉంచాలి. ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే 13(బి) సర్టిఫికెట్ జారీ చేయాలి.

– దరఖాస్తుల పరిశీలనను కలెక్టర్లు మానిటరింగ్ చేయాలి. ప్రతివారం నివేదికలు పంపాలి.

– సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారమంతా భూ భారతి పోర్టల్ ద్వారా పారదర్శకంగా నిర్వహించాలి.

అప్పట్లో ఆరు పేజీల్లో మార్గదర్శకాలు

2016లో సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన ఎలా చేయాలన్న అంశాలపై ఆరు పేజీల గైడ్‌లైన్స్ ఇచ్చారు. ప్రతి సందేహాన్ని నివృత్తి చేసేలా ఉండేది. ఏపీలో వైఎస్ జగన్, చంద్రబాబుల హయాంలో జారీ చేసిన గైడ్‌లైన్స్ కూడా మినిమం నాలుగు పేజీల వివరణ ఉంది. తెలంగాణలో మాత్రం పేజీన్నరలోనే ముగించేస్తున్నారు. దీంతో తహశీల్దార్లు, ఆర్డీవోలకు అనేక సందేహాలు ఉన్నాయి. గైడ్‌లైన్స్‌లో లేవన్న కారణంతో రిజెక్ట్ చేయడానికే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తున్నది.

Next Story