- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్- శ్రీశైలం హైవే విస్తరణకు గ్రీన్ సిగ్నల్!
ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న హైదరాబాద్- శ్రీశైలం హైవే విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న హైదరాబాద్- శ్రీశైలం హైవే విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. అత్యంత రద్దీ, తీవ్ర సమస్యాత్మకంగా ఉన్న జాతీయ రహదారులను ఇటీవల గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని విస్తరించాలని, కొన్ని మార్గాలను పునరుద్ధరించాలని కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది. వీటిలో హైదరాబాద్- శ్రీశైలం హైవే కూడా ఉంది. ఈ మార్గం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో నుంచి వెళ్తున్న నేపథ్యంలో.. కేంద్ర పర్యావరణ అనుమతులు తప్పనిసరి. అయితే కొన్నేళ్లుగా అనుమతులు రాకపోవడంతో విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరో సారి ఈ ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్ హెచ్-765) ను నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించింది.
రూ. 7,668 కోట్లతో ప్రతిపాదనలు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఈ రహదారిని ఎలివేటెడ్ కారిడార్ గా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అచ్చంపేట సమీపంలోని బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు రూ.7,668 కోట్ల అంచనాతో దీన్ని చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియా కావడంతో ఈ కారిడార్ ఏర్పాటుపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ గతంలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్‌ను స్వల్ప మార్పులతో కేంద్రం త్వరలో ఆమోదం తెలిపే అవకాశముంది. శ్రీశైలం పాతాళగంగ వరకు నాలుగు వరుసలతో 30 అడుగుల ఎత్తులో ఈ రహదారిని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో 300 మీటర్లను వయా డక్ట్ గా పరిగణించనున్నారు. ఈ కారిడార్ పూర్తయితే నల్లమల అటవీ ప్రాంతం నుంచి నేరుగా శ్రీశైలానికి వెళ్లవచ్చు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య 45 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది. దోమలపెంట-శ్రీశైలం మధ్య సస్పెన్షన్ బ్రిడ్జిని కూడా నిర్మించనున్నారు.
కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి..
ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్ల వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒకేసారి మూడు వాహనాలు వెళ్లలేనటువంటి పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తిన ప్రతిసారి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ సమస్యను అధిగమించేందుకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా సురక్షిత ప్రయాణం, వేగం, నల్లమల అడవిలో వన్యప్రాణులు రహదారి ప్రమాదాల బారిన పడకుండా కారిడార్ రోడ్డు సహాయపడుతుంది. కృష్ణానదిపై ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జిని కూడా నిర్మించనున్నారు. శ్రీశైలం మార్గం పర్యాటకానికి ప్రాముఖ్యత నేపథ్యంలో శ్రీశైలం డ్యామ్, పుణ్యక్షేత్రం, ఫరహాబాద్ వ్యూ పాయింట్, టైగర్ సఫారీ వంటి పలు పర్యాటక ప్రదేశాలకు యాత్రికులు పెరుగనున్నారు. కొత్త ఐకానిక్ వంతెన పర్యాటకులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
రహదారి నిర్మాణం 62 కిలోమీటర్లు
మన్ననూరు నుంచి ఫరహాబాద్, వటవర్లపల్లి, దోమలపెంట మీదుగా పాతాళగంగ వరకు రోడ్డు విస్తరించాలని అధికారులు ప్లాన్ చేశారు. ఇందుకు మొత్తం దూరం 62.5 కి.మీ నిర్మాణం జరగనుంది. కేవలం మన్ననూరులోనే 3.7 కి.మీ రోడ్డు నిర్మాణం అటవీ యేతర మార్గం కూడా ఉంది. మిగతా 58.8 కిలోమీటర్లు టైగర్ రిజర్వ్ పరిధిలోకి వస్తుంది. ఈ మార్గంలో భూగర్భం నుండి నిర్మాణంపై అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం రహదారి అనేక మలుపులతో ఉండగా, భూగర్భం నుంచి అయితే నేరుగా ఉంటుందని అధికారులు భావించారు. ఇందుకు దూరం కూడా 12 కి.మీ. వరకు తగ్గే అవకాశం ఉంది. కానీ చివరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం రహదారి 58 కిలోమీటర్ల పొడువు అయితే అందులో ఎలివేటెడ్ కారిడార్ 45.19 కిలోమీటర్లు, ఎట్-గ్రేడ్ రోడ్డు 9.725 కిలోమీటర్లు నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి 148 హెక్టార్లు భూసేకరణ అవసరం కానున్నట్లు అంచనా వేశారు. ఇందులో అటవీ భూమి 129 హెక్టార్లు, అటవీ యేతర భూమి 19 హెక్టార్లు అవసరపడనున్నట్లు ప్రణాళికల్లో పేర్కొన్నట్లు సమాచారం.






