నవంబరు‌లో గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు? గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఖతర్నాక్ వ్యూహాలు

by Prasad Jukanti |

గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబారాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు నవంబరులో ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు.

నవంబరు‌లో గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు? గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఖతర్నాక్ వ్యూహాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నవంబరులో గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబారాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 15 నుంచి ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం సెప్టెంబర్ చివరన ముగియనుంది. అక్టోబరు 1న ఫైనల్ ఓటరు లిస్టును ఈసీ ప్రకటించనుంది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటరు జాబితా ప్రకారం ఆ మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వరసగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.

దసరా తర్వాత షెడ్యూల్

ఓటర్ల జాబితా అందిన తర్వాత కార్పొరేటర్లు, మేయర్ల రిజర్వేషన్లను మున్సిపల్ శాఖ ఫైనల్ చేయనున్నది. ఈ ప్రక్రియ అంత ముగిసేందుకు కనీసం మూడు వారాల సమయం పడుతుంది. అక్టోబర్ 18న బతుకమ్మ, 20 దసరా కావడంతో.. ఆ పండుగలు ముగిశాక ఎన్నికల సంఘం గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబారాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి నవంబరు మొదటి లేదా రెండోవారంలో ఎన్నికల నిర్వహించే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.

క్యూర్‌లో పట్టుకోసం ప్లాన్

సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిని క్యూర్ ఏరియాగా ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విభజించారు. అక్కడ రాజకీయంగా పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే ఆయన వ్యూహాలు రచిస్తున్నట్టు టాక్. ఈ మూడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ చాలా వీక్‌గా ఉన్నది. ఈ పరిధిలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటూ గెలవలేదు. ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయం సాధించింది. అయినా ఆశించిన స్థాయిలో పార్టీ బలోపేతం కాలేదని టాక్. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్.. అభివృద్ది కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే కొత్త కార్యాలయాలకు భూమి పూజలు, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో బలంగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్‌పై సీఎం ఎటాక్ చేస్తున్నారు. ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు రాష్ట్ర అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. మొత్తంగా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.

కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు

క్యూర్ ఏరియాలో పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు షెడ్యూలు రెడీ చేసుకున్నట్టు తెలిసింది. జులై నుంచి ఆ మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్థానిక లీడర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి, కేడర్‌ను యాక్టివ్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఒక్కో పోలింగ్ బూత్‌కు కనిష్ఠంగా పది మంది యాక్టివ్ కార్యకర్తలను ఎంపిక చేసి, ఆ బూత్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యల పరిష్కార బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే యాక్టివ్ కార్యకర్తలను గుర్తించి, వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం.

Next Story