ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం రాజీనామాకు సన్నాహమా..?

by Bhanu |

గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యే మాగంటి అనారోగ్యంతో మృతి చెందిన జూబ్లీహిల్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం రాజీనామాకు సన్నాహమా..?
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఎమ్మెల్యే మాగంటి అనారోగ్యంతో మృతి చెందిన జూబ్లీహిల్స్ సెగ్మెంట్ తో పాటు మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం కనబడుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారనే వార్త హాట్ హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన దానం అనంతరం స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే దానం పార్టీ మారడాన్ని సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఆయన శాసనసభ్యత్వాన్ని రద్ధు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసులో త్వరలో తీర్పు రానుంది.ఈ నేపథ్యంలో కోర్టు ఒకవేళ తన శాసనసభ్యత్వాన్ని రద్ధు చేస్తూ ఆదేశాలు ఇచ్చేకంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే తలంపుతో దానం ఉన్నట్లు పార్టీ వర్గాలలో చర్చ జోరుగా నడుస్తోంది. ఈ నెలఖారులోగా దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని టాక్ వినబడుతోంది. అయితే అంతకుముందే మంత్రి వర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని, మంత్రి హోదాలోనే ఉప ఎన్నికలలో ఖైరతాబాద్ నుండి తిరిగి పోటీ చేస్తానని పార్టీ అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

ఇదే సమయంలో జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు తీసుకువచ్చే బాధ్యత నా భుజాలపై వేసుకుంటానని దానం నాగేందర్ పార్టీ నాయకత్వానికి విన్నవించుకున్నారట. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని రాజకీయవర్గాలలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులలో ఆసక్తిగా మారింది .

మూడు చోట్ల ఉప ఎన్నికలు తప్పవా ..?

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్, బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఇప్పటి వరకు టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కూడా రాజీనామా చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇదే జరిగితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటే గోషామహల్, ఖైరతాబాద్ లకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇంతకు బీజేపీకి గుడ్ బై చెప్పిన రాజాసింగ్ ఎమ్మెల్యే పదవి రద్ధవుతుందా.? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేస్తారా.? అనేది అన్ని పార్టీలలో చర్చలకు తెరలేపుతోంది.

Next Story